ఈ ఏడాదిలో ఏప్రిల్ నాటికి ఆంగ్లంలో అత్యధికంగా ఉపయోగించిన నామవాచకాల్లో 'కరోనావైరస్' ఒకటని ఆక్స్ఫర్డ్ లాంగ్వేజెస్ సంస్థ తెలిపింది. ఏటా ఉపయోగించే 'టైం' పదాన్ని కూడా ఇది అధిగమించందని ఆ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఏడాదికిగాను కరోనావైరస్తో పాటు దానికి సంబంధించిన మరి కొన్ని కొత్త పదాల వినియోగం కూడా కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిందని తెలిసింది.
దీనితో ఏటా అత్యధికంగా ఉపయోగించిన నామవాచకాన్ని చేర్చే 'వర్డ్ ఆఫ్ ది ఇయర్' ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. సాధారణంగా ఒక ఏడాదిలో అత్యధికంగా ఉపయోగించిన ఆంగ్ల పదాన్ని ఇందులో చేర్చుతుంది. కానీ ఒకటికి మించి ఎక్కువ నామవాచకాలు ఈ రేసులో ఉండటం ఇదే మొదటిసారి అని అభిప్రాయపడింది. భారత్లో 'ఈ-పాస్' పదాన్ని ఎక్కువగా వినియోగించారని అధ్యయనంలో తేలింది.