Unvaccinated omicron severity: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అధిక వేగంతో విస్తరించే లక్షణాలు... ఈ వేరియంట్‌కు ఉన్నందున వివిధ దేశాల్లో బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాధి తీవ్రతపై దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ కీలక విషయాలు వెల్లడించారు. టీకాలు తీసుకోని వారిపై ఈ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆమె పేర్కొన్నారు.
"ఒమిక్రాన్ బారినపడిన వారిలో ఎక్కువ ప్రభావానికి గురైన కేసులను నేను చూడలేదు. ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయి. అయితే.. టీకా తీసుకోని వారు వ్యాధి ప్రభావానికి ఎక్కువగా గురికావడం, ఆస్పత్రుల్లో చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్ వేసుకోనివారితో పోలిస్తే వ్యాక్సిన్ వేసుకున్నవారిలో స్పల్ప లక్షణాలు ఉన్నాయని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అయితే.. ఈ విషయంలో ప్రస్తుతం మార్పులు జరుగుతున్నాయి. టీకా తీసుకున్నవారు కూడా చాలా మంది రీఇన్ఫెక్షన్, బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్కు గురవుతున్న సందర్భాలను నేను చూస్తున్నాను. బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్ కేసుల్లో చాలా మంది గతంలో కరోనా సోకనివారే ఉన్నారు."
-డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ, దక్షిణాఫ్రికా వైద్యురాలు.
Omicron south africa: టీకా ఒక్క డోసు తీసుకున్నవారిలో కూడా ఒమిక్రాన్ బారినపడిన తర్వాత వారిలో స్వల్ప లక్షణాలే కనిపించాయని డాక్టర్ కోయెట్జీ తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ బాధితుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అందించాల్సి వచ్చిందని చెప్పారు. డెల్టా వేరియంటే భయంకరమైనదని ఆమె పేర్కొన్నారు.