దాదాపు ఐదు నెలల క్రితం చైనాలో చిన్న నిప్పు రవ్వలా ఆవిర్భవించిన కరోనా మహమ్మారి కార్చిచ్చులా మారింది! రోజురోజుకూ తన ఉద్ధృతిని పెంచుకుంటూ మానవాళిని బెంబేలెత్తిస్తోంది. అమెరికా, బ్రిటన్, రష్యా సహా అనేక దేశాలు దాని ధాటికి చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో అతలాకుతలమవుతున్నాయి. మానవాళి మొత్తానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలు దాటింది. అందులో 15 లక్షలకుపైగా బాధితులు ఒక్క అమెరికాలోనే ఉన్నారంటే కొవిడ్ దెబ్బకు అగ్రరాజ్యం ఎంతగా కుదేలవుతోందో అర్థం చేసుకోవచ్చు.
- ప్రపంచ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య: 5,085,066
- మరణాల సంఖ్య: 329,721
- కోలుకున్నవారు: 2,021,672
తొలినాళ్లలో చైనాను వణికించిన కొవిడ్.. తర్వాత ఐరోపా దేశాలను కుదిపేసింది. ఆపై అమెరికాలో విలయ తాండవం చేసింది. మృత్యు మృదంగాన్ని మోగించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ఇప్పటివరకు దాదాపు 3.30 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. అందులో 94 వేలకుపైగా మరణాలు అమెరికాలోనే సంభవించాయి. ప్రస్తుతం చైనా, అమెరికాతోపాటు ఐరోపావ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే రష్యా, బ్రెజిల్ తదితర దేశాల్లో దాని ఉద్ధృతి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రష్యాలో కేసుల సంఖ్య తాజాగా మూడు లక్షలు దాటింది. స్పెయిన్, ఇటలీ ఇటీవలి వరకు కరోనా దెబ్బకు కుదేలై.. ప్రస్తుతం కాస్త తేరుకుంటున్నాయి. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
బ్రెజిల్‌లో రికార్డు స్థాయి మరణాలు
బ్రెజిల్‌లో కొవిడ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశంలో 24 గంటల వ్యవధిలో 1,179 మంది ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంది. ఇప్పటివరకు అక్కడ ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 2.93 లక్షలు దాటింది.