ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో శతాబ్దాల చరిత్ర ఉన్న నోటర్ డ్యామ్ చర్చి గోపురం కూలిపోయింది. పైకప్పుపై మొదలైన మంటలు క్రమంగా గోపురానికి వ్యాపించాయి. క్రమంగా ఒకవైపునకు ఒరుగుతూ నేలమట్టం అయింది.
'నా కళ్ల ముందే చర్చి గోపురం కూలిపోయింది' - పైకప్పు
పారిస్ నగరంలోని చారిత్రక నోటర్ డ్యామ్ చర్చి శిఖరం కూలిపోయింది. భారీ అగ్ని ప్రమాదం ధాటికి పైకప్పు చాలా వరకు ధ్వంసమైంది. గోపురం కూలిన దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు నిశ్చేష్టులైపోయారు. ఆవేదనతోనే ఘటన జరిగిన తీరును వివరించారు.
ఈ ఘటన పారిస్వాసులను కలచివేసింది. చారిత్రక ప్రార్థనాలయం కళ్ల ముందే దగ్ధమైపోతుంటే ఆవేదన చెందారు. ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన వారు కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని ఇంకా నమ్మలేకపోతున్నామంటూ బాధపడ్డారు. గోపురం కూలిన ఘటన తీరును ఓ ప్రత్యక్ష సాక్షి వివరించారు.
"అంతర్జాలంలో వార్త చూసి నా కూతురు చెప్పింది క్యాథడ్రిల్లో భారీ మంటలు చెలరేగుతున్నాయని. ఆ సమయంలో నేను చర్చి సమీపంలోని వంతెన మీద ఉన్నా. అది చర్చి వెనుకనే ఉంది. నేను వెంటనే చర్చిలో మంటలు రేగడం చూశా. పైకప్పుపై ఎగిసిపడుతున్న మంటలు కాస్త గోపురానికి వ్యాపించాయి. అగ్నికీలల వల్ల గోపురం ఓ వైపునకు ఒరగడం ప్రారంభించింది. కాసేపటికి పైకప్పు కూలింది. మరికాసేపట్లోనే గోపురం పడిపోయింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పొగ దట్టంగా వ్యాపించింది. బాధతో అక్కడున్న ప్రజలు, నేను కళ్ల ముందు జరుగుతున్న సంఘటనను నమ్మలేని స్థితిలో ఉన్నాం. అగ్ని అలాగే రగులుతోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అది అంత సులువు కాదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి."
-- డొమినిక్ బిచాన్, ప్రత్యక్ష సాక్షి