తెలంగాణ

telangana

'కరోనా మూలాల నిర్ధరణకు చైనా సహకరించాలి'

By

Published : Jul 16, 2021, 5:30 AM IST

Updated : Jul 16, 2021, 6:48 AM IST

యావత్​ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారికి సంబంధించిన మూలాల నిర్ధరణకు చైనా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ కోరారు. 2019లో వైరస్​ ఆనవాళ్లను వుహాన్​లో గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. చైనాలోని వుహాన్ ల్యాబ్​ నుంచి వైరస్​ వ్యాప్తి చెందిందని పలు దేశాల ఆరోపణలు చేస్తున్నాయి.

WHO
టెడ్రోస్‌ అధనోమ్‌

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని వుహాన్‌లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. 'కరోనా వైరస్‌ మూలాలను తెలుసుకునేందుకు చైనా తప్పనిసరిగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం' అని జెనీవాలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. వూహాన్‌ ల్యాబ్‌నుంచే వైరస్ వ్యాప్తి చెందిందని పలు దేశాలు, పరిశోధనలు ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ చైనా వాటిని కొట్టిపారేస్తోంది. అసలు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నా వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్‌, గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు. ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నప్పుడు కెమెరాలో చిత్రీకరిస్తారు. ఆ క్లిప్‌లు కూడా బయటపెట్టడం లేదు. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి రావడంతో డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ల్యాబ్‌ను సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మొక్కుబడిగా నివేదిక ఇచ్చింది. 'పీ4 ల్యాబ్‌లోని యానిమల్‌ రూమ్‌లో వివిధ జంతువులు ఉండొచ్చు. సార్స్‌కోవ్‌-2 వంటి వాటిపై కూడా పనిచేయవచ్చు' అని తెలిపింది. అంతేకానీ, అక్కడ గబ్బిలాలను పెంచుతున్న విషయం పేర్కొనలేదు.

మరోవైపు చైనా ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకవ్వడం వల్లే కొవిడ్‌ మహమ్మారి ఉత్పన్నమై ఉంటుందన్న వాదనను విశ్వసించొచ్చని అమెరికా ప్రభుత్వ అధీనంలోని లారెన్స్ లివర్‌మోర్‌ జాతీయ లేబోరేటరీ 2020 మే నెలలోనే నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయా అంశాలపై మరింత లోతుగా పరిశోధించాలంటే చైనా సహకారం పూర్తిగా ఉండాలి. కానీ, డ్రాగన్‌ మాత్రం అందుకు ఆసక్తి చూపడం లేదు.

ఇదీ చూడండి:WHO: థర్డ్ వేవ్‌పై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ హెచ్చరిక!

Last Updated : Jul 16, 2021, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details