మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల ఇంటర్వ్యూపై బ్రిటన్ రాజకుటుంబం స్పందించింది. ఈ విషయంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. హ్యారీ మేఘన్ దంపతులు ఎదుర్కొన్న సమస్యలకు చింతిస్తున్నామని పేర్కొంది.
"హ్యారీ మేఘన్ దంపతులు గత కొన్నేళ్లుగా ఎదుర్కొన్న ఇబ్బందులపై మేము చింతిస్తున్నాము. ఇంటర్వ్యూలో పేర్కొన్న పలు సమస్యలు, ముఖ్యంగా జాతి వివక్ష.. ఆందోళనకరం. కొన్ని అంశాలు వేరుగా ఉండొచ్చు.. కానీ వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ సమస్యను కుటుంబ సభ్యుల సమక్షంలో పరిష్కరించేందుకు ప్రయత్నిసాం. హ్యారీ, మేఘన్, ఆర్చీ ఎప్పటికీ మా కుటుంబానికి ప్రత్యేకమే."
-బకింగ్‌హామ్ ప్యాలెస్
తీవ్రంగా పరిగణించాలి..
జాతివివక్షకు సంబంధించి హ్యారీ దంపతులు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
"హ్యారీ దంపతులు ఈ పరిస్థితులను ఎదుర్కోవడం చాలా బాధకరం. జాతివివక్ష, మానసిక సమస్యలపై మేఘన్ లేవనెత్తిన విషయాలు తీవ్రంగా పరిగణించాలి. 21వ శతాబ్దంలో కూడా బ్రిటన్‌లో జాతివివక్ష కొనసాగుతోంది. ఈ విషయంపై తక్షణమే చర్యలు చేపట్టాలి. ఈ సమస్య కేవలం రాజకుటుంబానికి మాత్రమే పరిమితమైనది కాదు."