తెలంగాణ

telangana

ETV Bharat / international

దిమిత్రి... ఫ్యాషన్​ ప్రపంచంలో "మయూరి"

వైకల్యం శరీరానికే కాని సంకల్పానికి కాదని నిరూపించింది ఓ చిన్నారి. 18 నెలల వయసులోనే ఎముకలను పిప్పి చేసే వ్యాధి బాల్యంపై పిడుగులా పడ్డా.. తల్లిదండ్రుల ప్రేరణతో నిలదొక్కుకుని 7 ఏళ్లు తిరిగే సరికి ఫ్యాషన్‌ ప్రపంచంలో తిరుగులేని తారగా ఎదిగింది. రెండు కాళ్లు లేకున్నా.. కృత్రిమ కాళ్ల సాయంతో ర్యాంప్‌పై అద్భుతాలు సృష్టిస్తోంది.

By

Published : Sep 16, 2019, 8:36 PM IST

Updated : Sep 30, 2019, 9:11 PM IST

దిమిత్రి... ఫ్యాషన్​ ప్రపంచంలో "మయూరి"

దిమిత్రి... ఫ్యాషన్​ ప్రపంచంలో "మయూరి"
బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్​కు చెందిన డెయిసీ మే దిమిత్రికి ఫిబ్యులర్ హెమిమెలియా అనే అరుదైన ఎముకల వ్యాధి సోకింది. ఈ వ్యాధి వల్ల కాలి ఎముకలో కొంత భాగం లేదా పూర్తిగా కనుమరుగవుతుంది. 50 వేల మందిలో ఒకరికే ఇలాంటి లోపం ఉంటుందని వైద్యులు తెలిపారు. 18 నెలలు వచ్చేసరికి లోపం తీవ్రం కావడం వల్ల ఆమె తల్లిదండ్రులు అలెక్స్, క్లెయిర్ దిమిత్రి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మోకాలిపై వరకు రెండు కాళ్లూ తొలగించకపోతే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పడం వల్ల ఆపరేషన్‌కు వారు అంగీకరించారు. దిమిత్రికి శస్త్ర చికిత్స చేసి రెండు కాళ్లు తొలగించారు.

మోడలింగ్​ వైపు..

రెండేళ్లు కూడా నిండని వయస్సులో కాళ్లు లేని తమ చిన్నారిని చూసి ఆ తల్లిదండ్రులు బాధతో విలవిల్లాడిపోయారు. ఆవేదనను దిగమింగుకొని తమ చిన్నారిలో ఆత్మవిశ్వాసం నింపాలని దృఢ నిర్ణయానికి వచ్చారు. దిమిత్రిని కొండంత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేలా పెంచారు. మోడలింగ్‌ రంగంలో దిమిత్రిని ప్రోత్సహించారు. కృత్రిమ కాళ్లతో ర్యాంప్‌ వాక్‌ చేసే మోడల్‌గా ఇప్పుడు దిమిత్రి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకొంది.

దిగ్గజ సంస్థలకు..

వైకల్యం డెయిసీ దిమిత్రికి ఏనాడూ అవరోధం కాలేదు. చదువుతోపాటు జిమ్నాస్టిక్స్‌లోనూ ఆ చిన్నారి ప్రావీణ్యం సాధించింది. ఎనిమిదేళ్ల వయసులో ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఏడాది కాలంలోనే అద్భుతాలు సృష్టించింది. బ్రిటన్‌లోని దిగ్గజ వస్త్ర విక్రయ సంస్థ బోడెన్‌, రివర్ ఐలాండ్‌ వంటి సంస్థలకు మోడలింగ్‌ చేస్తున్న దిమిత్రి.. నైకీ, మ్యాటలాన్ లాంటి బ్రాండ్లనూ ప్రమోట్ చేస్తోంది.

న్యూయార్క్​ ఫ్యాషన్​ వీక్​లో...

ఈ నెల 8న డెయిసీ దిమిత్రి మోడలింగ్ కెరియర్‌లో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించింది. ప్రఖ్యాత న్యూయార్క్‌ ఫ్యాషన్ వీక్‌లో కృత్రిమ కాళ్లతో ర్యాంప్‌పై వాక్ చేసిన.. తొలి చిన్నారిగా దిమిత్రి గుర్తింపు పొందింది. న్యూయార్క్ ఫ్యాషన్‌ వీక్‌లో ఆత్మవిశ్వాసంతో ర్యాంప్‌ వాక్‌ చేసిన దిమిత్రిపై.. సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది.

ప్రఖ్యాత పారిస్ ఫ్యాషన్ వీక్‌లోనూ దిమిత్రి మెరవబోతోంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ వద్ద సెప్టెంబరు 27న ఈ షో జరగబోతోంది. చిన్నారుల ఫ్యాషన్ బ్రాండ్ లూలూ ఎట్ జిజి అనే సంస్థను దిమిత్రి ప్రమోట్‌ చేయబోతోంది.

ఇదీ చూడండి: రష్యా: చిన్న కుక్కల సరికొత్త 'ప్రపంచ రికార్డు'

Last Updated : Sep 30, 2019, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details