తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్​ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు

ఐరోపా సమాఖ్యతో బ్రిటన్​ బంధం శుక్రవారంతో చెల్లిపోనుంది. జనవరి 31 రాత్రి 11 గంటల తర్వాత అధికారికంగా ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలుగుతుంది. 47 ఏళ్లుగా ఈయూలో ఉన్న దేశం ఎందుకు వైదొలుగుతోంది? బ్రెగ్జిట్​ తర్వాత ఈయూతో బ్రిటన్​ సంబంధాలు ఎలా ఉంటాయి? బ్రెగ్జిట్​ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు మీకోసం..

BREXIT
BREXIT

By

Published : Jan 30, 2020, 5:25 PM IST

Updated : Feb 28, 2020, 1:27 PM IST

స్వతంత్రంగా జీవించాలన్న బ్రిటన్​ ఆకాంక్ష శుక్రవారం నెరవేరనుంది. ఐరోపా సమాఖ్య నుంచి బ్రెగ్జిట్​ వైదొలిగే ప్రక్రియకు ఈయూ పార్లమెంటు ఆమోదం లభించింది. ఫలితంగా 2016లో బ్రిటన్​ రిఫరెండంతో మొదలైన బ్రెగ్జిట్​.. ఇప్పటికి పూర్తయింది. ఇక నుంచి బ్రిటన్ వాణిజ్యం, సరిహద్దు అంశాల్లో​ స్వతంత్ర దేశంగా ఉంటుంది.

వాణిజ్య అవసరాల కోసం ఏర్పడిన ఐరోపా సమాఖ్యలో బ్రిటన్​ 1973లో చేరింది. కూటమి నుంచి వైదొలుగుతున్న మొదటి దేశం​ యూకే కావటం విశేషం.

అసలేంటి ఈ దేశాల కూటమి?

ఐరోపాలోని 28 దేశాలతో ఏర్పడిన వాణిజ్య, రాజకీయ కూటమి ఈయూ. మొదట దీనిని ఐరోపా ఆర్థిక సమాజంగా పిలిచేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశాల మధ్య వాణిజ్య పరమైన సహకారం కోసం ఈయూ ఆవిర్భవించింది. వ్యాపారం కోసం ఐరోపా దేశాలు పరస్పర యుద్ధానికి దిగరాదన్నదే దీని ఏర్పాటు వెనక ఉద్దేశం.

సమాఖ్య ఒప్పందం ప్రకారం అన్ని దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం అమల్లో ఉంటుంది. వస్తు రవాణాపై ఎలాంటి కస్టమ్ సుంకాలు ఉండవు.

ఇందులో మరో ప్రధానమై ఒప్పందం.. స్వేచ్ఛా గమనం. అంటే ఒక ఈయూ దేశానికి చెందిన వ్యక్తి ఎలాంటి వీసా లేకుండా వేరే ఈయూ దేశంలో జీవించవచ్చు.

బ్రెగ్జిట్​ అంటే..

బ్రెగ్జిట్​ అంటే బ్రిటన్​ ఎగ్జిట్. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలగడాన్ని ఇలా వ్యవహరిస్తారు. ఇందుకోసం 2016 జూన్​ 23న బ్రిటన్​లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. బ్రెగ్జిట్​కు అనుకూలంగా 52 శాతం (1.74 కోట్ల మంది) ప్రజలు తీర్పునిచ్చారు.

ఎందుకు?

ఐరోపా సమాఖ్యలో ఉన్న కారణంగా తాము వెనకబడిపోతున్నట్లు బ్రిటన్ భావించింది. వ్యాపార విషయాల్లో అనేక పరిమితులు విధిస్తున్నారని ఆరోపించింది. సభ్యత్వ రుసుం కింద ఏటా వందల కోట్లు వసూలు చేస్తున్నారని, కానీ దానికి సరైన ప్రతిఫలం దక్కట్లేదన్నది ఆ దేశం మాట.

బ్రిటన్ తన సరిహద్దుల విషయంలో పూర్తి నియంత్రణ పొందాలని భావిస్తోంది. ఈయూ దేశాల వలసలను నియంత్రించాలని చూస్తోంది.

బ్రెగ్జిట్​ తర్వాత ఏమవుతుంది?

శుక్రవారంతో బ్రెగ్జిట్​ ప్రక్రియ పూర్తయినా.. రెండు పక్షాల మధ్య ఎన్నో అంశాలపై చర్చలు జరగాల్సి ఉంది. సమాఖ్య దేశాలతో భవిష్యత్తు సంబంధాలు ఎలా ఉండాలన్న విషయమై సమాలోచనలు చేయాల్సి ఉంది. కూటమి సహా ఇతర దేశాలతో బ్రిటన్​ సరికొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చోవాల్సి ఉంటుంది.

ఇందుకు ఈ ఏడాది డిసెంబర్​ 31 వరకు గడువు ఉంది. ఈ 11 నెలల సమయంలో ఐరోపా సమాఖ్య నిబంధనల ప్రకారమే బ్రిటన్​ నడుచుకోవాల్సి ఉంటుంది. అప్పటివరకు స్వేచ్ఛా వాణిజ్యం, గమనంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఆ సమయంలోగా బ్రెగ్జిట్​ ఒప్పందం జరిగేలా చూసుకోవటం కీలకం.

వాణిజ్య యుద్ధం, కరోనా సంక్షోభాల నేపథ్యంలో 11 నెలల గడువుపై బ్రిటన్​ను ఐరోపా సమాఖ్య హెచ్చరించింది. ఇంత తక్కువ కాలం సరిపోదని చెప్పింది. అయితే బ్రిటన్​ ప్రధాని మాత్రం గడువును పెంచేందుకు ఒప్పుకోలేదు.

ఏఏ ఒప్పందాలు అవసరం?

రెండు పక్షాల మధ్య కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగాలి. అది కూడా ఎలాంటి తనిఖీలు, అదనపు సుంకాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి.

వాణిజ్యేతర అంశాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. న్యాయ సంబంధ అంశాలు, డేటా షేరింగ్, భద్రత, విమానయాన ప్రమాణాలు, సముద్ర జలాల్లో చేపల వేట, విద్యుత్​, గ్యాస్​ సరఫరా, ఔషధాల అనుమతి, నియంత్రణ తదితర విషయాలూ బ్రెగ్జిట్ ఒప్పందంలో భాగం కావాలి.

ఎందుకీ బ్రెగ్జిట్ ఒప్పందం?

11 నెలల గడువు పూర్తయిన తర్వాత బ్రిటన్​ స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ సమయంలోగా ఒప్పందం జరగకపోతే.. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం బ్రిటన్​ వ్యాపారం సాగుతుంది. దిగుమతులు, ఎగుమతుల సుంకాల విధింపులు అమల్లోకి వస్తాయి.

బ్రెగ్జిట్​ ఒప్పందంలో చాలా వరకు థెరిసా మే ప్రభుత్వమే చర్చలు జరిపింది. అయితే బోరిస్ జాన్సన్​ ప్రధాని అయిన తర్వాత థెరిసా ప్రతిపాదించిన వివాదాస్పద 'బ్యాక్​స్టాప్​' అంశాన్ని తొలగించారు. బ్రెగ్జిట్​ తర్వాత ఉత్తర ఐర్లాండ్​, రిపబ్లిక్​ ఆఫ్​ ఐర్లాండ్​ మధ్య ఎలాంటి సరిహద్దు ఉండకూడదన్నది బ్యాక్​స్టాప్​ ఉద్దేశం. ఈ అంశం కారణంగానే బ్రెగ్జిట్​ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందలేకపోయింది.

అయితే.. సవరించిన బ్రెగ్జిట్​ ఒప్పందంలో మే ప్రతిపాదించిన అంశాలే అత్యధికంగా ఉన్నాయి. గడువు కాలంలో బ్రిటన్​, ఈయూ పౌరులకు పరస్పర స్వేచ్ఛా గమన హక్కులు ఉండటం, ఈయూకు చెల్లించే 30 బిలియన్​ పౌండ్ల సభ్యత్వ రుసుములో ఎలాంటి మార్పు లేకపోవటం ప్రధానమైనవి.

బ్రెగ్జిట్​కు ఇంత సమయం ఎందుకు పట్టింది?

2016లో బ్రిటన్​ రెఫరెండంతో బ్రెగ్జిట్​ శాసన ప్రక్రియ ప్రారంభమైంది. ఇది 2019 మార్చి 29న పూర్తి కావాల్సి ఉంది. అయితే మే ప్రతిపాదించిన ఒప్పందాన్ని బ్రిటన్​ ఎంపీలు రెండుసార్లు తిరస్కరించటం వల్ల ఆలస్యమైంది. బ్యాక్​స్టాప్​పై చాలా మంది తన పార్టీకే చెందిన ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాక్​స్టాప్​తో ఈయూ చేతుల్లోనే ఉంటామని వాదించారు.

చివరకు థెరిసా రాజీనామాకు అంగీకరించిన తర్వాత బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని ఎంపీలు ఆమోదించారు. జాన్సన్​ ప్రధాని అయిన తర్వాత ఒప్పందాన్ని చట్టంగా మార్చే ప్రక్రియలో జాప్యం కారణంగా బ్రెగ్జిట్​ గడువును జనవరి 31కి పొడిగించారు.

అయితే అప్పటికీ బ్రిటన్​ పార్లమెంటులో గందరగోళం తొలగకపోవటం వల్ల ముందస్తు ఎన్నికలకు జాన్సన్​ పిలుపునిచ్చారు. 2019 డిసెంబర్​లో ఎన్నికలు జరిగి తిరిగి అధికారం చేపట్టిన తర్వాత బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేశారు.

Last Updated : Feb 28, 2020, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details