బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఏప్రిల్‌లో భారత పర్యటనకు రానున్నారు. భారత్‌లో అవకాశాలను విస్తృతం చేసుకోవడం సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో దూకుడు వైఖరి అవలంబిస్తున్న చైనాకు గట్టి సందేశం ఇచ్చేలా బోరిస్ ఈ పర్యటన చేపట్టనున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
అమెరికాతో ఉన్న బలమైన సంబంధాలను కొనసాగిస్తూనే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకునే విధంగా రక్షణ, విదేశాంగ విధానాలను బ్రిటన్ ప్రభుత్వం మంగళవారం రూపొందించనుంది. ఈ నేపథ్యంలోనే బోరిస్ పర్యటనపై ప్రకటన రావడం గమనార్హం.
బ్రెగ్జిట్ అనంతర అవకాశాల కోసం
ఈ సందర్భంగా ఇండో పసిఫిక్‌ను ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు కేంద్ర బిందువుగా అభివర్ణించింది బ్రిటన్. బోరిస్ గత పర్యటన సందర్భంగా ఈ ప్రాంతంలో తమ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మోహరించిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రపంచపటంలో బ్రిటన్ స్థాయిపై దృష్టిసారించడం సహా బ్రెగ్జిట్ అనంతర పరిస్థితులలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బోరిస్ యత్నిస్తున్నారని పేర్కొంది.
రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బోరిస్ రావాల్సి ఉన్నప్పటికీ.. బ్రిటన్‌లో కరోనా విజృంభణ, కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రావడం వంటి కారణాల వల్ల అప్పుడు తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఇదీ చదవండి:పెరిగిన తాజ్‌మహల్ సందర్శన టిక్కెట్ ధర!