బ్రెగ్జిట్ విషయంలో ఎదురుదెబ్బతిన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఎంపీల ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. బ్రెగ్జిట్ బిల్లుపై చర్చించడానికి మరింత గడువు పెంచడానికి తాను సిద్ధమేనని, అయితే డిసెంబర్ 12న సార్వత్రిక ఎన్నికలు జరపడానికి అంగీకరిస్తేనే అది సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
ఐరోపా సమాఖ్య (ఈయూ) బ్రెగ్జిట్ గడువును అక్టోబర్ 31 నుంచి ఇంకా పెంచుతుందా? లేదా? అన్నది నేడు తేలనుంది. ఈ నేపథ్యంలో 10 డౌనింగ్ స్ట్రీట్లో అత్యవసర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం బోరిస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"బ్రెగ్జిట్ ఒప్పందంపై పార్లమెంట్లో సహేతుకమైన చర్చ జరగడానికి నిజంగా మరింత సమయం కావాలనుకుంటే, అలాగే చేద్దాం. కానీ ఎంపీలు డిసెంబర్ 12న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించాలి. అప్పుడు ప్రజలే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారు. "
- బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని
'బోరిస్ బ్రెగ్జిట్'
బోరిస్ గతవారం ఈయూతో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో వివాదాస్పదమైన ఐర్లాండ్ సరిహద్దు నిబంధనను పక్కనపెట్టారు. దీనికి ఎంపీల మద్దతు ఉంటుందని ఆయన భావించారు.