ఉక్రెయిన్.. అరుదైన పురాతన సంప్రదాయాలకు చిరునామాగా నిలుస్తున్న దేశం. ఇక్కడి కార్పాతియన్ పర్వతాలలో నివసించే తెగవారు.. అనాదిగా వస్తున్న తమ సంప్రదాయాల్ని పాటించటంలో భాగంగా.. గొడ్డలిని అలంకరణ వస్తువుగా ఉపయోగిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. పండుగలు, పెళ్లి వేడుకల్లో సంప్రదాయ దుస్తులతో గొడ్డళ్లు పట్టుకుని పాటలు పాడుతుంటారు. వివాహ సమయంలో యువకుడు గొడ్డలిని ధరించడం అక్కడి సంప్రదాయం.
జీవనోపాధిగా..
స్థానికుల్లో కొంతమందికి ఈ గొడ్డళ్ల తయారీనే జీవనోపాధి. ఆ కోవకు చెందిన హస్త కళాకారుడే నాజర్ హబోరాక్. హత్సుల్ అనే సంప్రదాయ గొడ్డలిని తయారు చేయటంలో మంచి నేర్పరి. తన కుటుంబం తరతరాలుగా కొనసాగిస్తున్న గొడ్డలి తయారీ వృత్తిలో తన తాత దగ్గర శిక్షణ తీసుకున్నాడు నాజర్. స్థానిక తెగల సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా విభిన్నమైన గొడ్డలను తయారు చేయటంలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
కుటుంబ సభ్యుల సహకారంతో..
సంప్రదాయ గొడ్డళ్ల రూపకల్పనలో కాంస్యం, ఇత్తడి, అల్యూమినియం, జింక్, రాగి వంటి లోహాలు ఉపయోగిస్తున్నాడు నాజర్. ఈ ఆయుధాల రూపకల్పనలో నాజర్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటున్నారు.