ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ పంపిణీకి దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు అత్యవసర వినియోగం కింద కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టాయి. ఇక కరోనా ధాటికి వణికిపోతోన్న ఐరోపాలోనూ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే, ఐరోపా సమాఖ్య(ఈయూ)కు చెందిన 27దేశాల్లో ఒకేరోజు వ్యాక్సిన్ ప్రారంభమవనున్నట్లు ఇటలీలో కరోనా మహమ్మారిపై నియమించిన ప్రత్యేక కమిషనర్ డొమెనికో అర్క్యూరీ వెల్లడించారు. ఆ రోజునే అన్ని దేశాలు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తాయని.. అనంతరం ఆయా దేశాలు వాటిని కొనసాగిస్తాయని పేర్కొన్నారు. అయితే, వ్యాక్సిన్ పంపిణీ ఏ రోజు ప్రారంభం అవుతుంది, ఆ రోజు ఎంతమందికి వ్యాక్సిన్ ఇస్తారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. భారీ స్థాయిలో చేపట్టే వ్యాక్సినేషన్ కన్నా ముందు రోజే ఒకేసారి అన్ని దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని ప్రకటించారు.