తెలంగాణ

telangana

ETV Bharat / international

మళ్లీ కొవిడ్‌ కల్లోలం.. జోరెత్తుతున్న కేసులు

కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోందా? దేశంలో థర్డ్​ వేవ్ తప్పదా? ఉత్పరివర్తనాల ముప్పు నుంచి తప్పించుకోలేమా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానం ఇవ్వాల్సి వస్తోంది. ఆయా దేశాల్లో తగ్గినట్టే తగ్గి.. మళ్లీ తిరగబెడుతున్న కొవిడ్ కేసులే దీనికి నిదర్శనం. బ్రిటన్ సహా.. పలు దేశాల్లో రోజువారీ కేసుల్లో పెరగుదల కరోనా ముప్పు ఇంకా ముగిసిపోలేదని చెబుతోంది.

covid
కొవిడ్‌

By

Published : Oct 21, 2021, 5:18 AM IST

Updated : Oct 21, 2021, 7:28 AM IST

క్రమంగా అదుపులోకి వస్తోందనుకుంటున్న కొవిడ్‌ మరోసారి విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. అగ్రరాజ్యాల నుంచి చిన్న దేశాల వరకు అన్నిచోట్లా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో రోజూ 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలూ సంభవిస్తున్నాయి. డెల్టా ఉత్పరివర్తనంలోని ఏవై 4.2 రకం ఇక్కడ కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం. సాధారణ డెల్టా కంటే ఇది 15శాతం అధిక వేగంతో వ్యాప్తి చెందుతుంది. రష్యాలోనూ రోజుకు 33వేల వరకు కేసులు వస్తుండగా, సుమారు వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ దేశ జనాభాలో 29శాతానికే రెండు డోసుల టీకా అందింది. ఆంక్షలు అంతగా లేకపోవడంతో మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వంటి నగరాల్లో ప్రజలు స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు. మాస్కు పెట్టుకోవాలన్న నిబంధన అక్కడ కచ్చితంగా అమలు కావడం లేదు. దేశవ్యాప్తంగా కొవిడ్‌తో 4.18 లక్షల మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంక సంస్థ రొస్టాట్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుత విలయం నేపథ్యంలో అక్టోబరు 30 నుంచి నవంబరు ఏడు వరకు దేశవ్యాప్తంగా సెలవులు ప్రకటిస్తామని ప్రధాని మిఖాయిల్‌ మిషుస్తిన్‌ వెల్లడించారు. కేసుల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నచోట్ల అక్టోబరు 23నుంచే ఆంక్షలు విధించాలని ఉప ప్రధాని తత్యానా గొలికోవా సూచించారు. జూన్‌ చివరి వారం నుంచి ఆస్ట్రేలియాలో డెల్టా ఉత్పరివర్తనం దాడి మొదలైంది. విక్టోరియా వంటి ప్రాంతాల్లో కొవిడ్‌ జడలు విప్పుతోంది. రాజధాని కాన్‌బెర్రాతో పాటు ప్రధాన నగరాలు సిడ్నీ, మెల్‌బోర్న్‌ లాంటిచోట్ల కేసులు పెరుగుతున్నాయి.

అద్భుతమైన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు ఉన్నా, టీకాలు ముమ్మరంగా వేస్తున్నా, ఇప్పటికీ కొవిడ్‌ దెబ్బకు అమెరికా అల్లాడుతోంది. డెల్టా ఉత్పరివర్తనం విచ్చలవిడిగా వ్యాపిస్తుండటంతో అక్కడ కేసులు, మరణాలు కనీవినీ ఎరగని రీతిలో ఎగబాకుతున్నాయి. ఇప్పటివరకు భారతదేశంలో నాలుగు లక్షల మందికి పైగా కొవిడ్‌తో మరణిస్తే- అమెరికాలో 7.28 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మూడున్నర నెలల్లోనే అక్కడ మృతుల సంఖ్య లక్షకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో రోజుకు 90 వేల కేసులు వస్తున్నాయి. మూడొంతులకు పైగా బాధితులు ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. రోగుల సంరక్షణ కోసం సైనిక వైద్యులు, నర్సులనూ రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐసీయూల మీద భారం పెరుగుతోంది. కొవిడ్‌ మూలంగా మధ్య వయస్కులు ఎక్కువగా మరణిస్తుండటం కలవరపరుస్తోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అమెరికన్లలో టీకాల పట్ల విముఖత తగ్గడం లేదు. వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నా- దాదాపు ఏడు కోట్లమంది ఇప్పటికి ఒక్క డోసైనా తీసుకోలేదు. టీకాలు వేయించుకోనివారి వల్ల వ్యాధి వ్యాప్తి అధికమవుతోందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. మరోవైపు వైద్యసిబ్బంది, 60 ఏళ్లు దాటినవారు, ఇతర వ్యాధులు ఉన్నవారికి బూస్టర్‌ డోసులు ఇచ్చేందుకు అక్కడి వ్యాధి నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.

కోరలు సాచిన డెల్టా ఉత్పరివర్తనం ఎవరినీ వదలడంలేదు. ఆరోగ్యవంతులైన యువత సైతం దీనిబారిన పడి ఐసీయూల్లో వెంటిలేటర్ల మీద చికిత్స పొందాల్సి వస్తోంది. శీతాకాలం మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ తీవ్రత ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించడం, అది కాస్త తగ్గగానే మళ్ళీ బీచ్‌లు, పబ్‌లు, కేసినోలకు బారులు తీరడం వల్లే అమెరికాలో పరిస్థితులు కట్టుతప్పాయి. ఇటలీలో మాత్రం కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉద్యోగాలు, పనులకు వెళ్ళాలంటే అక్కడ తప్పనిసరిగా కొవిడ్‌ పాస్‌ చూపించాలి. రెండు డోసుల టీకా వేయించుకున్నవారికి అక్కడ ‘గ్రీన్‌పాస్‌’ ఇస్తున్నారు. దాంతోపాటు 48 గంటల ముందు చేయించుకున్న కొవిడ్‌ పరీక్షలో నెగిటివ్‌ ఫలితం రావాలి. అవి లేనివారు ఉద్యోగాలకు వస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అమెరికా, రష్యా వంటి దేశాల్లో కనీస జాగ్రత్తలనూ గాలికొదిలేయడంతో మహమ్మారి విజృంభిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం సగటున రోజూ 22వేల కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కేసుల నమోదు వెయ్యిలోపే ఉంటోంది. 94 కోట్ల వయోజనుల్లో దాదాపు ముప్పై కోట్ల మందికే రెండు డోసుల టీకాలు అందాయి. టీకాల పంపిణీని వేగవంతం చేసి, చిన్నారులకూ వ్యాక్సిన్‌ రక్షణ కల్పిస్తేనే యావద్దేశానికీ ముప్పు భయం తప్పుతుంది.

- కామేశ్‌

ఇవీ చదవండి:

Last Updated : Oct 21, 2021, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details