కొవిడ్ వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే టీకా పంపిణీ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో వ్యాక్సిన్‌లపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు ఆయా ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోనూ (Vaccine Lottery Australia) వ్యాక్సిన్ తీసుకున్న వారికి లాటరీ ద్వారా నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఇందులో పాల్గొన్న ఓ 25ఏళ్ల యువతి లక్కీ డ్రా సొంతం చేసుకొని ఒకేసారి కోటీశ్వరురాలు అయ్యింది. తాజాగా తీసిన లాటరీలో జాన్నే ఝు అనే సిడ్నీ యువతి రూ.5.4కోట్ల నగదు బహుమతి గెలుచుకుంది.
ఆస్ట్రేలియాలో కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రోత్సహించేందుకు అక్కడి 20 కార్పొరేట్ సంస్థలు, దాతలు కలిసి 'మిలియన్ డాలర్ వ్యాక్స్' కూటమిగా ఏర్పడి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రోజువారీ లాటరీలో నగదు బహుమతితోపాటు ఒక మిలియన్ డాలర్ల (ఆస్ట్రేలియన్ డాలర్) నగదును లక్కీ విజేతకు అందజేస్తామని ప్రకటించారు. దీనికి స్థానికంగా విశేష స్పందన లభించింది. చివరి తేదీని అక్టోబర్ 31గా ప్రకటించగా.. దాదాపు 3600 పోస్టల్ కేంద్రాల నుంచి 27లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో సిడ్నీకి చెందిన జాన్నే ఝు (25) అనే యువతిని పదిలక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ.5.4కోట్ల) లక్కీ డ్రా వరించింది. తాజాగా ఈ నగదును సదరు యువతికి అందించినట్లు 'మిలియన్ డాలర్ వ్యాక్స్' నిర్వాహకులు పేర్కొన్నారు.