వాస్తవాధీన రేఖ వెంబడి బ్రహ్మపుత్ర నదిపై(చైనాలో యార్లంగ్ జాంగ్బో నది) చైనా భారీ జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. అయితే.. చైనా ఆనకట్టల ప్రతిపాదనలు భారత్, బంగ్లాదేశ్‌లోని నదీ పరీవాహక రాష్ట్రాల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. డ్యాం ప్రణాళికలపై మాట్లాడారు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హ్యూ చున్యింగ్. యార్లంగ్ జాంగ్బో నదీ పరీవాహక ప్రాంతాల్లో జల విద్యుత్ ఉత్పత్తి చైనా చట్టబద్ధమైన హక్కు అని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:బ్రహ్మపుత్రపై చైనా భారీ హైడ్రోపవర్ ప్రాజెక్ట్!
''యార్లంగ్ జాంగ్బో నది దిగువ ప్రాంతాల్లో జల విద్యుత్ అభివృద్ధి చైనా చట్టబద్ధమైన హక్కు. సరిహద్దుల్లోని నదుల వినియోగం, అభివృద్ధి విషయంలో చైనా ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగానే ఉంటుంది.''
- హ్యూ చున్యింగ్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ఎగువ ప్రాంతంలో డ్యాం ఏర్పాటు అంశంపై భారత్ ఇప్పటికే తన అభిప్రాయాలు, ఆందోళనలను చైనా అధికారులకు తెలియజేసింది. ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను చైనా దృష్టిలో పెట్టుకుని తగిన విధంగా చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు హాని జరగకుండా చూసుకుంటూ ఎగువ భాగాన నిర్మాణాలు చేపట్టాలని కోరింది. బ్రహ్మపుత్ర నది కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ. జలాల మళ్లింపు చేపట్టడం లేదని.. చైనా తమకు ఎన్నో సార్లు చెప్పిందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:బ్రహ్మపుత్రపై చైనా డ్యాం- అలా చేస్తే భారత్‌కు లాభం!
ఈ నేపథ్యంలో.. చున్యింగ్ స్పందించారు. భారత్, బంగ్లాదేశ్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని, అవి కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు.