WHO Omicron: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 70కి పైగా దేశాల్లో వెలుగు చూసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోనూ ఇప్పటికే ఈ వేరియంట్ వ్యాపించి ఉండవచ్చని చెప్పింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తెలిపింది.
"77 దేశాల్లో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మిగతా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు ఇంకా నిర్ధరణ కాకపోయినప్పటికీ.. అక్కడ కూడా ఈ వేరియంట్ కేసులు ఉండవచ్చు. గతంలో ఏ వేరియంట్ లేనంత ఎక్కువ వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోంది."
-ప్రపంచ ఆరోగ్య సంస్థ
Omicron countries: "చాలా మంది ఒమిక్రాన్‌ను తేలికపాటిదిగా భావిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ కలిగించే ప్రమాదంపై తక్కువగానే అంచనా వేశాం. ఒమిక్రాన్‌తో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కేసులు సంసిద్ధంగా లేని ఆరోగ్య వ్యవస్థపై పెనుముప్పును తేగలవు" అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఇదీ చూడండి:ఇన్‌ఫెక్షన్‌కు టీకా తోడైతే.. యాంటీబాడీలు పుంజుకున్నట్టేo
booster dose omicron: ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డబ్ల్యాహెచ్ఓ కోరింది. టీకా వేసుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని తెలిపింది. బూస్టర్ డోసు వల్ల ఒమిక్రాన్ వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కోవడంపై ఆధారాలు లేకపోయినా.. చాలా దేశాలు బూస్టర్ డోసు పంపిణీ చేస్తున్నాయని డబ్యూహెచ్ఓ పేర్కొంది.
అంతకుముందు... ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అదే సమయంలో మరణాలు సంఖ్య కూడా పెరుగుతుందని హెచ్చరించింది.
చైనాలో రెండో కేసు
China omicron cases: చైనాను ఒమిక్రాన్ వేరియంట్ కలవరానికి గురి చేస్తోంది. ఆ దేశంలో రెండో కేసు మంగళవారం వెలుగు చూసింది. 67 ఏళ్ల ఓ వ్యక్తికి ఈ వేరియంట్ సోకినట్లు తేలిందని చైనా అధికారిక మీడియా తెలిపింది.
విదేశాల నుంచి నవంబరు 27న వచ్చిన సదరు వ్యక్తి.. రెండు వారాలపాటు క్వారంటైన్లో ఉన్నారు. అప్పుడు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గానే తేలింది. శనివారం ఆయన గ్వాంగ్జౌ నగరానికి చేరుకున్నాడు. అక్కడ మరో వారంపాటు ఆయన క్వారంటైన్లో ఉన్నారు. సోమవారం ఆయన మరోసారి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. తర్వాత చేసిన జన్యుపరీక్షల్లో ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధరణ అయిందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:బ్రిటన్‌లో తొలి 'ఒమిక్రాన్' మరణం- పాక్‌లో మొదటి కేసు
Polish teenager omicron: యూరప్ నుంచి ఈ నెల ప్రారంభంలో చైనాకు వచ్చిన ఓ టీనేజర్‌కు ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు వెలుగు చూసిందని చైనా ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తెలిపారు. అయితే... సదరు టీనేజర్ తమ దేశానికి చెందిన వ్యక్తి అని పోలాండ్ ఆరోగ్య శాఖ మంగళవారం ధ్రువీకరించింది. ఒమిక్రాన్ నిర్ధరణ అయిన ఆ టీనేజర్ వర్సా నుంచి గతవారం తన తల్లితో కలిసి చైనాకు వెళ్లిందని చెప్పింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉందని పోలాండ్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు.
డిసెంబరు 6న వర్సా నుంచి బయలుదేరే ముందు నిర్వహించిన పరీక్షల్లో టీనేజర్‌కు కరోనా నెగెటివ్‌గానే తేలిందని సదరు అధికారి తెలిపారు. చైనాకు చేరిన తర్వాత ఆమెకు కరోనా సోకగా.. డిసెంబరు 13న రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో ఒమిక్రాన్ నిర్ధరణ అయిందని చెప్పారు. ఒమిక్రాన్ సోకిన ఆ టీనేజర్ ప్రస్తుతం చైనాలోని టింజియాన్ నగరంలో ఉన్నారని చైనా గ్లోబల్ టైమ్స్ పత్రిక తన కథనంలో తెలిపింది.
ఇదీ చూడండి:దక్షిణ కొరియాపై కరోనా పంజా- రోగులతో ఆస్పత్రులు ఫుల్