Khesari lal yadav: భోజ్‌పురి ప్రముఖ గాయకుడు ఖేసరి లాల్ యాదవ్.. ఓ లైవ్‌షోకు అనుకున్న సమయానికి రాలేదని రచ్చ రచ్చ చేశారు అభిమానులు. తీవ్ర ఆగ్రహంతో వందల కుర్చీలు, వాహనాలకు నిప్పంటించారు. స్టేజీని కూడా ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతవారణం నెలకొంది. నేపాల్‌లోని సున్సారి జిల్లా బుర్జ్‌లోని విరాట్‌నగర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
ఏం జరిగింది?
బుర్జ్ మహోత్సవ్ సందర్భంగా విరాట్‌నగర్‌లో ఓ లైవ్ షోకు ప్లాన్ చేశారు భోజ్‌పురి గాయకుడు ఖేసరి లాల్ యాదవ్. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన బృందంతో నేపాల్ కూడా వెళ్లాడు. మంగళవారం లైవ్ షో జరగాల్సి ఉంది. ఆయన పెర్ఫార్మెన్స్ను ప్రత్యక్షంగా తిలకించేందుకు అభిమానులు ఉదయం నుంచే వందల సంఖ్యలో భారీగా తరలివచ్చారు. ఈ షో ఎంట్రీ కోసం వీక్షకుల నుంచి నిర్వాహకులు రూ.300వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే షో టైం అయినా ఖేసరి లాల్ యాదవ్ స్టేజీ వద్దకు చేరుకోలేదు. దీంతో గంటల పాటు ఎదురుచూసిన అభిమానుల ఓపిక నశించి విధ్వంసానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.