తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్ వేళ పెరిగిన బరువును తగ్గిద్దాం!

Weight loss tips: కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బరువు పెరిగారు. ఆంక్షల వల్ల ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి, 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' వంటివి ఇందుకు కారణం. ఈ అదనపు బరువును తగ్గించుకుని, కొవిడ్​కు పూర్వ దశకు చేరుకోవడానికి శరీరానికి ప్రేరణ అవసరమని చెబుతున్నారు నిపుణులు. శరీరంలోని అంతర్గత 'ఫ్యాట్‌ బ్రేక్‌'ను సద్వినియోగం చేసుకొని, బరువును తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

covid kilos
బరువును ఇలా తగ్గించేద్దాం!

By

Published : Dec 12, 2021, 5:44 AM IST

Weight loss tips: కొవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతరం దుస్తులు బిగుతుగా మారాయా? కొంచెం ఒళ్లు చేసినట్లు అనిపిస్తోందా? అయితే మీలాంటివాళ్లు ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నారు!! 30 దేశాల్లో 22 వేల మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. వీరిలో మూడో వంతు మంది.. కొవిడ్‌ మహమ్మారి సమయంలో బరువు పెరిగారు. ఆంక్షల వల్ల ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి, 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' వంటివి ఇందుకు కారణం. లాక్‌డౌన్‌లు సంపూర్తిగా తొలగిపోయి, మరింత స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతులు లభించాక.. ఈ అదనపు బరువులో కొంతమేర సహజసిద్ధంగానే తగ్గొచ్చని ఆస్ట్రేలియా నిపుణులు చెబుతున్నారు. అయితే కొవిడ్‌కు పూర్వ దశకు చేరుకోవడానికి మాత్రం మీ శరీరానికి ప్రేరణ అవసరమంటున్నారు. 'కొత్త సంవత్సరాల తీర్మానాల' కోటాలో చేర్చకుండా ఇప్పుడే దాన్ని రగిలించాలని కోరుతున్నారు. శరీరంలోని అంతర్గత 'ఫ్యాట్‌ బ్రేక్‌'ను సద్వినియోగం చేసుకొని, బరువును తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

'సెట్‌' చేస్తుంది..

Set point in weight: సాధారణ వ్యక్తుల్లో కొన్ని కిలోలు అటూఇటుగా స్థిరమైన బరువు కొనసాగుతుంది. దీనికి కారణం 'సెట్‌ పాయింట్‌'. బరువు నిర్దిష్ట స్థాయి దాటితే అది క్రియాశీలమవుతుంది. వెంటనే రక్షణ యంత్రాంగాలను ప్రేరేపిస్తుంది. అవి మనల్ని పూర్వస్థితికి తీసుకెళుతాయి. ఒకవేళ బరువు పెరిగితే.. ఆకలిని తగ్గించడం ద్వారా శరీరం స్పందిస్తుంది. కొంచెం తినగానే కడుపు నిండిందన్న భావనను కలిగిస్తుంది. ఇందుకోసం ఆకలికి సంబంధించిన హార్మోన్ల పోకడలో మార్పులు చేస్తుంది. శారీరకంగా చురుగ్గా ఉండటంపై ఆసక్తిని పెంచుతుంది. ఫలితంగా నడక వంటి ఆలోచిత చర్యలను; అనాలోచితంగా కాళ్లు, చేతులను చిన్నగా కదిలించడం వంటి లక్షణాలను ప్రదర్శిస్తారు. ఇలాంటి అనేక శారీరక స్పందనలను 'ఫ్యాట్‌ బ్రేక్‌'గా కూడా పిలుస్తున్నారు. కొవ్వు పేరుకుపోయే ప్రక్రియను ఇది నెమ్మదింపచేయడమే దీనికి కారణం. దీన్నిబట్టి బరువును తగ్గించుకునే మీ ప్రయత్నాల్లో శరీరం కూడా తనవంతు తోడ్పాటు అందిస్తుందన్నమాట.

ఇదీ చూడండి:నెమ్మదిగా తింటే బరువు తగ్గుతారా?

కొన్ని నెలలు మితిమీరి తింటే ఏమవుతుంది?

Fat breaking foods: ఒక ప్రయోగంలో భాగంగా.. సన్నగా ఉన్న యువకులకు వంద రోజుల పాటు రోజుకు వెయ్యి కాలరీలకు మించి ఆహారాన్ని పరిశోధకులు అందించారు. వంద రోజుల తర్వాత.. వారిలో జీవక్రియ రేటు పెరిగినట్లు వెల్లడైంది. ప్రయోగం ముగిశాక నాలుగు నెలల్లో పెరిగిన కొవ్వు 74 శాతం మేర తగ్గింది. ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని నెలల పాటు మితిమీరి తిన్న తర్వాత కూడా 'ఫ్యాట్‌ బ్రేక్‌' చురుగ్గానే పనిచేస్తోందని దీన్నిబట్టి స్పష్టమవుతోందని వారు తెలిపారు. అయితే వయసు మీద పడేకొద్దీ ఈ ఫ్యాట్‌ బ్రేక్‌ ప్రభావం తగ్గిపోతుందని జంతువుల్లో నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. మానవుల్లోనూ ఇలాగే జరుగుతుందా.. అది ఎప్పుడు చోటుచేసుకోవచ్చు.. వంటివాటిపై నిర్దిష్ట అంచనాలు కట్టడం కష్టమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మితిమీరి తినడం వల్ల శరీరాలు స్పందించే తీరును జన్యువులు ప్రభావితం చేస్తాయని తెలిపారు. వయసు, జన్యువుల పరంగా అనుకూలతలు లేనివారు మరింతగా వ్యాయామం, ఆహార నియమాలు పాటించాల్సిందే. లేకుంటే బరువు బాధ మోయాల్సిందే.

ఇదీ చూడండి:బరువు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు

అనాలోచిత తిండి తగ్గిద్దాం..

  • శరీర సంకేతాలను ఆలకించడం ముఖ్యం. ఆకలిగా ఉన్నప్పుడే భోజనం చేయాలి. సంతృప్తి భావన వచ్చిన వెంటనే తిండి ఆపేయాలి.
  • ఆకలిగా ఉన్నప్పుడు కొద్ది పరిమాణాల్లో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి.
  • ప్లేట్‌లోని ఆహార పదార్థాలను తినడానికి ముందు కడుపులోకి సాధ్యమైనంత ఎక్కువగా కూరగాయలను తోసేయండి. అప్పుడు కొంచెం తిన్నా.. 'ఇక చాలు' అనే భావన కలుగుతుంది.
  • శరీర సంకేతాలకు అనుగుణంగా భోజనం చేసే విషయంలో మొబైల్‌ యాప్‌ల సాయం కూడా తీసుకోవచ్చు.
  • ఏ ఆహారం తీసుకోవాలి.. ఎంత తీసుకోవాలన్నదానిపై నిపుణుల సూచనలు పాటించాలి.
  • ఆకలిగా లేని సమయంలో భోజనం చేసే పరిస్థితిని తప్పించుకోవడానికి.. చురుకైన, ఉత్తేజభరితమైన పనులు చేయవచ్చు. బృంద క్రీడలు, నృత్యాలు, లాక్‌డౌన్‌ సమయంలో చేయలేకపోయిన ఇతర కార్యక్రమాలను ఆలోచించండి.
  • ఎదురుగా కనిపించింది కదా అని అనాలోచితంగా తినే అలవాటును తగ్గించుకోవాలి. స్నాక్స్‌, తినాలన్న భావన కలిగించే ఇతర ఆహార పదార్థాలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి.
  • లాక్‌డౌన్‌తో స్వల్పంగా పెరిగిన కిలోలకు మించి బరువుంటే నిపుణుల సలహా తీసుకోవాలి.
  • * ఇతర సమస్యల దృష్ట్యా బరువును తప్పనిసరిగా తగ్గించుకోవాల్సినవారికి వేరే చికిత్సలూ ఉన్నాయి. తక్కువ క్యాలరీలున్న ద్రవ ఆహారం వంటివి ఉంటాయి. వాటిని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.

ఎప్పుడు తినాలి..

శరీర సంకేతాలను ఆలకించి.. బాగా ఆకలివేసినప్పుడే..

ఏం చేయాలి..

క్రీడలు, నృత్యాలు, వ్యాయామం లాంటి ఉత్తేజం కలిగించే పనులు.

ఇదీ చూడండి:10 రోజుల్లో బరువు తగ్గాలా? ఈ చిట్కాలు పాటించండి!

ABOUT THE AUTHOR

...view details