తెలంగాణ

telangana

ETV Bharat / international

vietnam covid: డెల్టా గుప్పిట్లో వియత్నాం- అందువల్లేనా?

కొవిడ్​ను మొన్నటిదాకా సమర్థవంతంగా ఎదుర్కొన్న వియత్నాంలో (vietnam covid) పరిస్థితి మారిపోయింది. డెల్టా ధాటికి అల్లకల్లోలంగా మారింది. ఆక్సిజన్‌కు, మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. టీకా కార్యక్రమంపై శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ప్రస్తుత దుస్థితి దాపురించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

vietnam
వియత్నాం

By

Published : Sep 21, 2021, 6:25 AM IST

Updated : Sep 21, 2021, 6:51 AM IST

కరోనా వైరస్‌ను సమర్థంగా అదుపు చేసిన దేశాల జాబితాలో ఇటీవలి వరకు సగర్వంగా నిలిచిన వియత్నాం (vietnam covid)- నేడు డెల్టా రకం దెబ్బకు విలవిల్లాడుతోంది. 2020 జనవరి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 27 వరకు అక్కడ కేవలం 4,000 కొవిడ్‌ కేసులే నమోదయ్యాయి. అవీ విదేశాల నుంచి వచ్చినవారి కారణంగానే. మొత్తం కొవిడ్‌ మరణాలు 35 దాటలేదు. ఏప్రిల్‌ నెలాఖరు నుంచి డెల్టా రకం వల్ల కరోనా కేసులు పెరుగుతూ ప్రస్తుతం ఏడు లక్షలకు చేరువయ్యాయి. మరణాలు సైతం 17,000 దాటుతున్నాయి. 9.8 కోట్ల వియత్నాం జనాభాలో 6.3శాతానికే రెండు డోసుల కొవిడ్‌ టీకాలు అందాయి. టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేయడానికి వియత్నాం ఎనిమిది కొవిడ్‌ టీకాలను అనుమతించింది. వాటిలో క్యూబా రూపొందించిన అబ్దాలా టీకా సైతం ఉంది. వియత్నాంకు ఆర్థిక చోదక శక్తి అయిన హోచిమిన్‌ నగరంలో మే 31 నుంచి విధించిన లాక్‌డౌన్‌ను సెప్టెంబరు 15న ఎత్తివేయాలని తొలుత తలపోశారు. డెల్టా విజృంభణతో ఈ నెలాఖరు వరకు దాన్ని పొడిగించారు. ఆ నగరంలో ఇద్దరికన్నా ఎక్కువ మంది గుమిగూడకుండా చూడటానికి ఆగస్టు 23నుంచి సైన్యాన్ని మోహరించారు. అయినా కేసులు తగ్గలేదు. రికార్డులకు ఎక్కని కేసులు మరెన్నో ఉంటాయని అంచనా. వియత్నాం అంతటా నమోదైన కేసుల్లో అత్యధికం ఒక్క హోచిమిన్‌ నగరంలోనే వెలుగుచూశాయి. మొత్తం మరణాల్లో 80శాతం అక్కడే నమోదయ్యాయి. ఉన్నపళాన వచ్చిపడిన కరోనా విజృంభణను ఆస్పత్రులు తట్టుకోలేకపోతున్నాయి. ఆక్సిజన్‌కు, మందులకు తీవ్ర కొరత ఏర్పడింది.

అతలాకుతలం..

ఒకప్పుడు ఆగ్నేయ ఆసియాలోనే అత్యంత సమర్థంగా కరోనాను నియంత్రించి, ఆర్థిక ప్రగతికి ఢోకా లేకుండా చూసుకొందని వియత్నాం ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఆ దేశం సైతం కరోనా కోరల్లో చిక్కి అతలాకుతలమవుతోంది. హోచిమిన్‌ నగరమంతటా లాక్‌డౌన్‌ విధించిన మాట నిజమే కానీ- ఎయిర్‌ కండిషన్డ్‌ కార్యాలయాలు, ఇరుకు ఇళ్లు, సందులు, జనం గుమిగూడే స్థలాల్లో వైరస్‌ వృద్ధిని అరికట్టలేకపోయామని నిపుణులు పేర్కొంటున్నారు. హోచిమిన్‌ నగరంలో అల్పాదాయ వర్గాలు, మురికివాడలు ఎక్కువ. డెల్టా రకం కేసులు పెరగకముందే లాక్‌డౌన్‌ విధించి ఉంటే ఫలితం ఉండేదన్నది నిపుణుల అభిప్రాయం. లాక్‌డౌన్‌ వల్ల రెస్టారెంట్లు మూతపడటమే కాకుండా, ఆహార డెలివరీ సేవలు సైతం నిలిచిపోయాయి. కిరాణా సరకులనూ ప్రభుత్వ ఆన్‌లైన్‌ పోర్టల్‌ నుంచే ఆర్డరు చేయాల్సి వస్తోంది. దాదాపు కోటిమంది జనాభా ఉన్న హోచిమిన్‌ నగర డిమాండును ఈ ఆన్‌లైన్‌ సర్వీసు తీర్చలేక పదేపదే స్తంభించిపోతోంది.

టీకాపై అశ్రద్ధే కారణమా?

వియత్నాం ఆర్థిక వ్యవస్థను కొవిడ్‌ బాగా దెబ్బతీస్తోంది. 2021లో ఆ దేశ జీడీపీ వృద్ధి రేటు 6.8శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. డెల్టా విజృంభణతో దాన్ని 4.8శాతానికి తగ్గించింది. వియత్నామ్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ కంపెనీలకూ కొవిడ్‌ నష్టం తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్‌ వల్ల తమ సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయని వియత్నామ్‌లో ఉత్పత్తి సాగిస్తున్న సామ్‌సంగ్‌, ఎస్‌కే వంటి 30 దక్షిణ కొరియా సంస్థలు ప్రభుత్వానికి తెలిపాయి. రవాణా కార్యకలాపాలను పునరుద్ధరించాలని, దక్షిణ కొరియా నుంచి నిపుణ కార్మికులు రావడానికి సులువుగా వీసాలు ఇవ్వాలని, తమ కార్మికులకు టీకా ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కోరాయి. కొవిడ్‌ వల్ల వియత్నామ్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు), ప్రాజెక్టులు తగ్గుతున్నాయి. అక్కడ సింగపూర్‌, జపాన్‌, దక్షిణ కొరియా అత్యధికంగా పెట్టుబడులు పెట్టాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి వాటి పెట్టుబడులు తగ్గాయి. లాక్‌డౌన్‌ను అదేపనిగా పొడిగిస్తూ పోతే ఎఫ్‌డీఐలు మరింత తగ్గుతాయని, ఆర్డర్లు ఇతర దేశాలకు మళ్ళే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వంద రోజులుగా లాక్‌డౌన్‌లో ఉన్న హోచిమిన్‌ నగర ప్రజలు, మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించడం వల్ల ఒరిగేది ఏముందని ప్రశ్నిస్తున్నారు. కొవిడ్‌ను ఆరంభంలో బాగా అదుపు చేసిందని ప్రశంసలు అందుకున్న వియత్నాం టీకా కార్యక్రమంపై (vaccination) శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ప్రస్తుత దుస్థితి దాపురించింది. వియత్నాం ఇతర దేశాలు విరాళంగా ఇచ్చిన టీకాల మీద ఆధారపడిందే తప్ప టీకాల కొనుగోలుకు, క్యూబాలా సొంతంగా తయారీకి చర్యలు తీసుకోకపోవడం పెద్ద తప్పన్న విమర్శలు జోరెత్తుతున్నాయి.

- ప్రసాద్‌

ఇదీ చూడండి:Ins airavat: కొవిడ్ సామగ్రితో వియత్నాం చేరిన ఐఎన్​ఎస్ ఐరావత్

Last Updated : Sep 21, 2021, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details