Ukraine Crisis: రష్యా దాడుల భయంతో ఉక్రెయిన్ అణ్వాయుధాల తయారీకి సిద్ధమైందా? ఇదే రష్యాను మరింత త్వరగా ఉక్రెయిన్‌పై దాడి చేసేలా ప్రేరేపించిందా? రష్యా మీడియా ఇలాంటి కథనాలనే ప్రచురించింది. అణ్వాయుధాలను వదులుకున్న ఉక్రెయిన్ తిరిగి అణ్వస్త్రాలను తయారు చేయడానికి సిద్ధమైనట్లు రష్యన్ మీడియా ఆరోపించింది. ఇందుకు రష్యా అణు సాంకేతికతనే వాడుకోవాలని ఉక్రెయిన్ చూసిందని కథనాలు ప్రచురించింది. ప్రస్తుతం రష్యా చేసిన ఈ సంచలన ఆరోపణలు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
నాటోలో చేరేందుకు ఉక్రెయిన్ యత్నించటమే రష్యాను ఆ దేశంపై యుద్ధానికి ఉసిగొల్పినట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ, ప్రస్తుత యుద్ధం వెనుక మరో బలమైన కారణం ఉన్నట్లు రష్యన్ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. సరిహద్దు దేశమైన రష్యాతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరగా ఉక్రెయిన్ అణు ఆయుధాల తయారీని ప్రారంభించాలని నిర్ణయించినట్లు రష్యన్ మీడియా వెల్లడించింది. సొంతంగా అణ్వాయుధాలను సృష్టించేందుకు రష్యాకు చెందిన అణు పరిజ్ఞానాన్నే ఉక్రెయిన్ వాడుకోవాలని చూసిందని పుతిన్ చెప్పినట్లు అక్కడి మీడియా రాసుకొచ్చింది. ఉక్రెయిన్ తయారు చేయబోయే అణ్వాయుధానికి 'డర్టీ బాంబ్' అని పేరు కూడా పెట్టినట్లు వివరించింది.
Russia Invasion latest News: చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్‌ప్లాంట్‌లో ఉక్రెయిన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందన్న రష్యా ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యలను ఆ దేశ వార్త సంస్థలు టీఏఎస్ఎస్, ఆర్ఐఏ, ఇంటర్‌ఫాక్స్, ఆదివారం ప్రచురించాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత 1994లో అణ్వాయుధాలను వదులుకుంటున్నట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తిరిగి అణుబాంబు తయారు చేయడం అంటే అది రష్యాపై యుద్దం ప్రకటించడమేనంటూ పుతిన్ వ్యాఖ్యానించినట్లు రష్యన్ మీడియా పేర్కొంది. అయితే అణుబాంబు తయారీ ఆరోపణలకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు తమ వద్ద లేవని రష్యన్ మీడియా పేర్కొంది. కానీ పక్కాగా చెర్నోబిల్‌లో అణుబాంబు తయారు చేస్తుందన్న సమాచారం మాత్రం ఉందని రాసుకొచ్చాయి. అది కూడా ఫ్లూటోనియం ఆధారిత అణ్వాయుధాన్ని తయారు చేసే దిశగా ఉక్రెయిన్ సన్నాహాలు చేసినట్లు ఆరోపించింది.
Russia Nuclear Dirty Bomb: అణ్వాయుధ తయారీకి కావాల్సిన ఫ్లూటోనియంను అమెరికా సరఫరా చేసే అవకాశం లేకపోలేదని రష్యాకు చెందిన ఓ అధికారి అన్నారు. యూరేనియంను సమకూర్చుకునే ప్రయత్నాలను ఉక్రెయిన్ ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఇందుకోసం యూరేనియం గనుల్లో మరింత లోతు వరకు తవ్వకాలు జరుపుతున్నట్లు వివరించారు. అటు కీవ్ ప్రతినిధులు యూరేనియాన్ని శుద్ధి చేసే సంస్థలతోనూ సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. తమకంటూ సొంతంగా యూరేనియం శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసేలా కీవ్ ప్రతినిధులు సంబంధిత కంపెనీలకు సూచించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రష్యా దాడులతో నిర్మానుష్యంగా కీవ్: ఉక్రెయిన్ ఎంపీ