దేశీయంగా కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన మూడో దేశంగా టర్కీ నిలిచిందని ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు రిసెప్ తయీప్ ఎర్డోగాన్. తమ దేశం కన్నా ముందు అమెరికా, చైనా మాత్రమే స్థానికంగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వాయవ్య రాష్ట్రం కోకలీలో.. టర్కీ శాస్త్రీయ, సాంకేతిక పరిశోధన మండలి (టీయూబీఐటీఏకే) కేంద్రాల ప్రారంభోత్సవంలో ఈ మేరకు వెల్లడించారు ఎర్డోగాన్.
" టీయూబీఐటీఏకే ఏర్పాటు చేసిన కొవిడ్-19 విభాగం.. ప్రస్తుతం 8 రకాల వ్యాక్సిన్లు, 10 రకాల ఔషధాలపై పని చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో కరోనా కట్టడికి వ్యాక్సిన్లు, ఔషధాలను అభివృద్ధి చేయటంలో గణనీయమైన పురోగతి సాధించాం."
- రిసెప్ తయీప్ ఎర్డోగాన్, టర్కీ అధ్యక్షుడు