ట్రంప్ మెనూ: శాక మెరుగని మాంసాహారి..!
డొనాల్డ్ ట్రంప్ ఓ మాంసాహారి. ఏ దేశానికి వెళ్లిన ఆయన కోసం ప్రత్యేకంగా మాంసాహార పదార్ధాలు సిద్ధంగా ఉంటాయి. కానీ తొలిసారి శాకాహారం సిద్ధంగా ఉంచారు. కానీ ఈ విందు భోజనాన్ని చూసిన సిబ్బంది మాత్రం కలవరపడుతున్నారు.
తమ అధినేత ఎక్కడికి వెళ్లినా ఆయనకు సకల సౌకర్యాలు కల్పించడంలో అమెరికా అధ్యక్షుడి భద్రతా సిబ్బంది ఏమాత్రం రాజీపడరు. ఆయనకు వీసమెత్తు అసౌకర్యం కలగకుండా పక్కాగా వ్యవహరిస్తారు. కానీ... భారత్‌లో పర్యటనకు వచ్చిన ట్రంప్ కోసం ప్రధాని మోదీ ప్రత్యేకంగా తయారు చేయించిన మెనూపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అందులో మాంసాహార పదార్థాలు లేకపోవడమే ఇందుకు కారణం. సలాడ్‌తో కూడిన భోజనం మినహా ట్రంప్ శాకాహార పదార్థాలు తింటుండగా తాను ఒక్కసారి కూడా చూడలేదని, ఈసారి ఏం జరుగుతుందోనంటూ ఓ అధికారి వాపోయారు.
- ట్రంప్ సాధారణంగా ఉడికించిన/కాల్చిన మాంసం ముక్కలు(స్టీక్స్), బీఫ్ బర్గర్లు, మాంసంతో చేసిన రొట్టెలు(మీట్‌లోఫ్) తింటుంటారని తెలిపారు. విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు స్టీక్స్ అందుబాటులో లేకుంటే గొర్రె మాంసం ఇస్తారన్నారు. మెక్‌డొనాల్డ్‌లోని బీఫ్ బర్గర్లు తమ అధ్యక్షుడికి ఇష్టమని, అయితే... ఇండియాలోని బ్రాంచీల్లో చికెన్ బర్గర్లు మాత్రమే లభిస్తాయన్నారు.
- పూర్తి శాకాహారి అయిన ప్రధాని మోదీ... ట్రంప్ కోసం ప్రధానంగా గుజరాత్‌లో ప్రసిద్ధ వంటకమైన ఖమన్‌తోసహా వెజ్ బర్గర్లు, మల్టీగ్రెయిన్ రొట్టెలు, బ్రొకొలీ/మొక్కజొన్న సమోసాలు, వివిధ రకాల తేనీరు, కొబ్బరి నీళ్లతోపాటు మరెన్నో వంటకాలు సిద్ధం చేశారు. మంగళవారం రాష్ట్రపతి ఇచ్చే విందులోనూ ఇలాంటి మెనూనే ఉండనుంది.
- ట్రంప్ దంపతులు సోమవారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సమయంలో అక్కడ అందుబాటులో ఉంచిన ఖమన్‌తోసహా ఏదీ రుచి చూడలేదని ఆశ్రమ ట్రస్టీ కార్తికేయ తెలిపారు.