మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన యాంగూన్‌లో సుమారు 2వేల మందికి పైగా నిరసనకారులు ఆదివారం ర్యాలీలు నిర్వహించారు. నిర్బంధంలో ఉంచిన ఆంగ్ సాన్ సూకీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
యాంగూన్ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఆందోళనలు చేపట్టిన కార్మిక, విద్యార్థి సంఘూలు, సామాజిక కార్యకర్తలు 'లాంగ్ లివ్ మదర్ సూ' అనే నినాదాలతో ర్యాలీని హోరెత్తించారు. అలాగే 'మిలిటరీ నియంతృత్వం నశించాలి' అంటూ నినాదాలు చేశారు. ఆంగ్ సాన్ సూకీతో పాటు.. అధ్యక్షుడు 'విన్ మింట్'లకు స్వేచ్ఛ ప్రసాదించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు కూడా..
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగించడానికి వీల్లేకుండా.. ఇంటర్నెట్‌కు వ్యాప్తిని సైన్యం తగ్గించింది. ఇప్పటికే అక్కడ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేసిన సైన్యం ఫేస్‌బుక్‌పై నిషేధించింది. గత ఎన్నికల్లో జరిగిన మోసాలపై అందిన ఫిర్యాదులను పరిష్కరించడంలో సూకీ విఫలమైందని మిలటరీ ఆరోపిస్తోంది.