తెలంగాణ

telangana

ETV Bharat / international

పశ్చిమాసియా క్వాడ్‌లో భారత్ భాగస్వామ్యం- భద్రతకు భరోసా

బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు(బీఆర్‌ఐ)తో పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో చైనా ఆర్థికంగా పాగా వేయడం భారత్‌, అమెరికాలనే కాదు- యూఏఈని సైతం కలవరపెడుతోంది. చైనాతోపాటు టర్కీ పోకడలూ పశ్చిమాసియాను చీకాకు పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్‌, యూఏఈలతో కూడిన కొత్త క్వాడ్‌లో దిల్లీ భాగస్వామి అయింది. కొత్త క్వాడ్‌తో ఇజ్రాయెల్‌, యూఏఈలకు దగ్గరైన భారత్‌ అదే సమయంలో ఇరాన్‌ను దూరం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి.

west asia quad
పశ్చిమాసియా క్వాడ్‌

By

Published : Nov 4, 2021, 7:21 AM IST

తూర్పున చైనా, పశ్చిమాన టర్కీల గిల్లికజ్జా ధోరణులతో విసుగెత్తిన భారతదేశం ఇక మెత్తగా ఉంటే లాభం లేదని కొత్త పొత్తులు కుదుర్చుకుంటోంది. ఇండో-పసిఫిక్‌ చతుర్భుజ కూటమి(క్వాడ్‌) తరవాత తాజాగా పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్‌, యూఏఈలతో కూడిన కొత్త క్వాడ్‌లో దిల్లీ భాగస్వామి అయింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు(బీఆర్‌ఐ)తో పశ్చిమాసియా, ఆఫ్రికాలలో చైనా ఆర్థికంగా పాగా వేయడం భారత్‌, అమెరికాలనే కాదు- యూఏఈనీ కలవరపెడుతోంది. దుబాయ్‌కు చెందిన భారీ నిర్మాణ సంస్థ డీపీడబ్ల్యూ ఇంతకుముందు ఆఫ్రికాలోని జిబూటీ రేవులో కంటైనర్‌ టెర్మినల్‌ నిర్మాణానికి 48.5 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఆ ప్రాజెక్టులో ఓ చైనా కంపెనీ 23.5శాతం వాటా తీసుకోగానే డీపీడబ్ల్యూను సాగనంపారు. దీనిపై దుబాయ్‌ మండిపడుతోంది. ఇజ్రాయెల్‌తోపాటు భారత్‌లోనూ డీపీడబ్ల్యూ ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులు చేపట్టింది. కొచ్చిన్‌, ముంద్రా, నావ షీవా రేవుల్లో కంటైనర్‌ టెర్మినళ్లను నిర్వహిస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో పారిశ్రామిక పార్కులు, ఐటీ టవర్లు, వైద్య కళాశాల తదితరాల నిర్మాణానికి దుబాయ్‌, భారత్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

టర్కీ, పాక్‌ పెడపోకడలు

చైనాతోపాటు టర్కీ పోకడలూ పశ్చిమాసియాను చీకాకు పరుస్తున్నాయి. ఒకప్పడు ఆట్టొమన్‌ తురుష్క(టర్కీ) సామ్రాజ్యంలో అంతర్భాగాలైన ఈజిప్ట్‌, సౌదీ అరేబియా తదితర పశ్చిమాసియా ప్రాంతాలు మొదటి ప్రపంచ యుద్ధం తరవాత స్వతంత్ర రాజ్యాలయ్యాయి. సున్నీ ముస్లిం దేశాలకు టర్కీ తరవాత సౌదీ అరేబియా నాయకురాలిగా ఎదిగింది. ఎర్డొగాన్‌ టర్కీ అధినేత అయినప్పటి నుంచి పూర్వ ఆట్టొమన్‌ వైభవాన్ని పునఃప్రతిష్ఠించాలని, ఇస్లామిక్‌ దేశాలకు మళ్ళీ నాయకత్వం వహించాలని కలలు కంటున్నారు. అందుకే, కశ్మీర్‌ వ్యవహారాల్లో తలదూరుస్తూ ఐరాసలో పాకిస్థాన్‌ కొమ్ముకాస్తున్నారు. సిరియాలో ఐసిస్‌ తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న టర్కీ, అక్కడ పాకిస్థానీ కిరాయి మూకలనూ దింపిందని ఓ అమెరికన్‌ పాత్రికేయురాలు వెల్లడించారు. యూఏఈ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ముస్లిం బ్రదర్‌ హుడ్‌ను టర్కీ సమర్థిస్తోంది. అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్‌, యూఏఈ, బహ్రెయిన్‌ల మధ్య నిరుడు అబ్రహాం ఒప్పందం కుదిరింది. ప్రపంచ ముస్లిములు జెరూసలెంలోని అల్‌ అక్సా మసీదుకు వచ్చి ప్రార్థనలు జరుపుకోవచ్చునని ఆ తరవాత ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఆ మసీదును విముక్తం చేస్తానంటూ టర్కీ అధినేత ఎర్డొగాన్‌ బీరాలు పలకడంపై ఇజ్రాయెల్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. మరోవైపు... కశ్మీర్‌ సమస్యపై భారత్‌ను విమర్శించాల్సిందిగా పాక్‌ ఇంతకాలం సౌదీ అరేబియా నాయకత్వంలోని ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ(ఓఐసీ)ని పురిగొల్పుతూ వచ్చింది. కానీ, ఇటీవల సౌదీ, యూఏఈలు పాక్‌కు వంతపాడటం మానేశాయి. దీనిపై కోపించిన పాకిస్థాన్‌ 2019లో ఓఐసీకి పోటీగా టర్కీ, మలేసియాలతో కలిసి సమాంతర ఇస్లామిక్‌ సంస్థను ఏర్పరచాలని విఫల యత్నం చేసింది. దీనిపై మండిపడిన సౌదీ తనకు చెల్లించాల్సిన 300 కోట్ల డాలర్ల బాకీని వెంటనే తీర్చేయాలని పాక్‌పై ఒత్తిడి తెచ్చింది. అందులో 100 కోట్ల డాలర్లను ఇస్లామాబాద్‌ నిరుడు చైనా సాయంతో చెల్లించింది. ఇటీవల యూఏఈ సైతం తనకు రావాల్సిన 100 కోట్ల డాలర్లను వెంటనే చెల్లించాలని పట్టుపట్టడం- అసలే దివాలా అంచులో ఉన్న ఇస్లామాబాద్‌ను బెంబేలెత్తించింది. తమపై అణ్వస్త్ర దాడి జరుపుతామని కొన్నేళ్ల క్రితం ఓ పాక్‌ మంత్రి బెదిరించడం ఇజ్రాయెల్‌కు చిర్రెత్తించింది.

ఇరాన్‌ దూరం కాకూడదు

చైనా, టర్కీలు పశ్చిమాసియాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవడం... పాకిస్థాన్‌ వాటికి ఊతమివ్వడం అమెరికా గమనిస్తోంది. ఇండో-పసిఫిక్‌ నుంచి పశ్చిమాసియా వరకు చైనా ఆర్థిక ఆధిపత్యమూ విస్తరిస్తున్న దృష్ట్యా జంట క్వాడ్‌లతో అగ్రరాజ్యం ప్రతివ్యూహం రచిస్తోంది. ప్రస్తుతానికి కొత్త కూటమి- వాణిజ్యం, ఇంధన సరఫరా, నౌకా రవాణా భద్రత, వాతావరణ మార్పుల నిరోధంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు... ఐరాస నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు తన గడ్డ మీద నుంచి ఆర్థిక సహాయం అందకుండా నిరోధించలేకపోయినందుకు పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో కొనసాగించాలని అంతర్జాతీయ ఆర్థిక కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) నిర్ణయించింది. పాక్‌తో పాటు ఈసారి టర్కీనీ ఆ జాబితాలో చేర్చడం సంచలనం సృష్టించింది. సిరియా, ఇతర దేశాల్లో ఉగ్రవాదులకు నిధులు అందకుండా కట్టడి చేయడంలో టర్కీ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాదు, రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొంటున్నందుకు టర్కీపై అమెరికా ఇప్పటికే ఆర్థిక ఆంక్షలు విధించింది. ఇలా టర్కీపై అన్ని వైపుల నుంచీ ఒత్తిడి పెరుగుతోంది. కొత్త క్వాడ్‌తో ఇజ్రాయెల్‌, యూఏఈలకు దగ్గరైన భారత్‌ అదే సమయంలో ఇరాన్‌ను దూరం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనలు నిష్క్రమించిన తరుణంలో అక్కడ పాక్‌ ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి ఇరాన్‌ సహకారం భారత్‌కు అవసరం. మొత్తమ్మీద ఇండో-పసిఫిక్‌ క్వాడ్‌కు సమాంతరంగా ఆకస్‌ సైనిక కూటమిని ఏర్పరచిన అమెరికా- రేపు పశ్చిమాసియాలోనూ సరికొత్త సైనిక సమీకరణకు తెరతీసినా, ఆశ్చర్యం లేదు.

- ప్రసాద్‌

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details