చైనా, అమెరికాల మధ్య మరో సారి వాణిజ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాజాగా 200 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై 25 శాతం వరకు సుంకాలను పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పెరిగిన సుంకాలు మే 10 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపారు.
ఈ నెల 8న చైనా ఉన్నతాధికారులు మరో దఫా చర్చల కోసం అమెరికాకు వెళ్లనున్నారు. ఈ తరుణంలో ట్రంప్ సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
"10 నెలల నుంచి చైనా 50 బిలియన్ డాలర్ల టెక్ వస్తువులపై 25 శాతం, 200 బిలియన్ డాలర్ల ఇతరవస్తువులపై 10 శాతం సుంకాలను అమెరికాకు చెల్లిస్తుంది. ఇప్పడు 10 శాతం సుంకాలను 25 శాతానికి పెంచుతున్నాము. "
- డొనాల్డ్ ట్రంప్ ట్వీట్
చైనాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని... అయితే నెమ్మదిగా జరుగుతున్నాయని వెల్లడించారు ట్రంప్. చైనాపై సుంకాల వడ్డన కారణంగా ఆ దేశ ఉత్పత్తుల ధరలపై స్వల్ప ప్రభావం ఉంటుందన్నారు.