అఫ్గానిస్థాన్ ప్రజలకు తాలిబన్లు (Afghanistan Taliban) డెడ్‌లైన్ విధించారు. సంక్షోభ సమయంలో చేజిక్కించుకున్న ప్రభుత్వ ఆస్తులు, ఆయుధాలు, వాహనాలు, మందుగుండు సామగ్రిని వారంలోగా తమకు అప్పగించాలని ఆదేశించారు. లేదంటే చట్టపర చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
ఆగస్టు 15న అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ(Ashraf Ghani) పరారీతో.. అఫ్గానిస్థాన్ మొత్తం తాలిబన్ల(Taliban news) అధీనంలోకి వచ్చింది. ప్రావిన్సులను ఒక్కొక్కటిగా ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రక్షణ, భద్రత కరవై.. ప్రభుత్వ ఆస్తులపై పడ్డారు స్థానికులు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా ఇతరత్రా ఎత్తుకెళ్లారు. ఇప్పుడు.. వాటన్నింటినీ తిరిగిచ్చేయాలని తాలిబన్లు స్పష్టం చేశారు.
''కాబుల్‌లోని ప్రజలందరి కోసం ఓ ప్రకటన. వాహనాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర ప్రభుత్వ ఆస్తులు కలిగిఉన్న వారంతా.. సంబంధిత శాఖలు, కార్యాలయాలకు వాటిని అప్పగించాలి. చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవాలంటే.. వారంలోగా పని పూర్తిచేయాలి.''
- జబీహుల్లా ముజాహిద్, తాలిబన్ల ప్రతినిధి
కొద్దిరోజుల ముందు కూడా తాలిబన్లు(Taliban latest news) ఇలాంటి ప్రకటనే చేశారు. కానీ.. అప్పుడు ఆయుధాల గురించి మాత్రమే ప్రస్తావించారు.
''తమ భద్రత కోసం ఉంచుకున్న ఆయుధాలను వెంటనే అప్పగించాలి. ఇప్పుడు మీ భద్రత మా బాధ్యత.''
- తాలిబన్లు