అఫ్గాన్‌లో తాలిబన్ల బీభత్సం అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి విధ్వంసం సృష్టించారు. భారీ కారుబాంబు పేలుడుకు పాల్పడ్డారు. సామాన్యులే లక్ష్యంగా కుందుజ్ అనే నగరంలోని ఆసుపత్రిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. అక్కడి రోగులతో సహా 8 మంది జవానులను బందీలుగా తీసుకెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రభుత్వ భద్రతా బలగాల దాడుల్లో 35 మంది తాలిబన్లు హతమయ్యారు. చర్చలు జరుగుతుండగానే...
అఫ్గానిస్థాన్‌లో శాంతి కోసం తాలిబన్లు, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆ ఉగ్రసంస్థ దాడికి తెగబడింది. ఓ ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లి గాయపడ్డ రోగులను తమ అదుపులోకి తీసుకుంది. తాలిబన్లు, అఫ్గాన్ భద్రతా దళాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది.
దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది తాలిబన్ సంస్థ.
''18 సంవత్సరాల యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో అమెరికాతో చర్చలు జరుపుతున్నప్పటికీ... భద్రతాదళాలను, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తూనే ఉంటాం.''
-జబీహుల్లా ముజాహిద్, తాలిబన్ ప్రతినిధి
ఇదీ చూడండి : అసోం ఎన్ఆర్సీపై సర్వత్రా అసంతృప్తి