అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది. దేశంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తాలిబన్లు ప్రకటించారు. 20ఏళ్లు పాటు అమెరికా- దాని మిత్రదేశాలపై నిర్విరామంగా పోరాటం చేసిన వారికి ప్రభుత్వంలో పెద్దపీట వేశారు.
ఆపద్ధర్మ ప్రధాని ముల్లా హసన్ అఖుంద్ నేతృత్వంలో పాలన సాగనుంది. 2001లో తాలిబన్ల ప్రభుత్వం కుప్పకూలిన సమయంలోనూ ఈయనే ప్రధానిగా ఉన్నారు. మరోవైపు అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందంపై చర్చలు సాగించిన, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘని బరాదర్‌కు కేబినెట్లో ఉప ప్రధాని బాధ్యతలను అప్పగించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎంత కాలం కొనసాగుతుందనే విషయంపై తాలిబన్లు స్పష్టతనివ్వలేదు. ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న ప్రశ్నకూ సమాధానం లేదు.