స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ బిల్లును ఆమోదించింది తైవాన్ పార్లమెంట్. ఆసియాలో ఈ చట్టాన్ని రూపొందించిన ప్రప్రథమ దేశంగా చరిత్రలో స్థానం సంపాదించింది.
లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ల (ఎల్జీబీటీ) హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నవారంతా బిల్లు ఆమోదంతో ఆనందంలో మునిగిపోయారు. ఇంద్ర ధనస్సు రంగు జెండాలు, 'ఓటు ఓడిపోదు' అన్న నినాదాలతో కూడిన ప్లకార్డులు చేతబట్టి... వేలసంఖ్యలో ప్రజలు పార్లమెంట్ బయట గుమిగూడారు.
ఒత్తిళ్లు, వ్యతిరేకతల మధ్య...
చర్చి వ్యతిరేకత, ఎల్జీబీటీ గ్రూపుల ఒత్తిళ్ల మధ్య చట్టసభ సభ్యులు బిల్లును ఆమోదించారు. సాధారణ వివాహంలో ఉండే అన్ని రకాల ప్రభుత్వ పథకాలు స్వలింగ వివాహాలకూ వర్తించనున్నాయి. బిల్లు ఆమోదం పొందకుండా ఉండేందుకు గత కొద్ది రోజులుగా కన్జర్వేటివ్ నేతలు విఫలయత్నం చేశారు.