తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్​ పీఠంపై మరోమారు ఆంగ్​ సాన్​ సూకీ!

మయన్మార్​లో సంపూర్ణ ప్రజాస్వామ్యం దిశగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్​లో పాల్గొన్నారు. ఐదు దశాబ్దాల సైనిక నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతూ 2015లో అధికార పగ్గాలు చేపట్టిన నోబల్​ శాంతి బహుమతి విజేయ ఆంగ్​ సాన్​ సూకీ వైపే ప్రజలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆమె పార్టీకి ప్రత్యామ్నాయంగా బలమైన విపక్షం లేకపోవటమూ ఒక కారణం.

Suu Kyi party set to win Myanmar
ఆంగ్​ సాన్​ సూకీ

By

Published : Nov 8, 2020, 6:41 PM IST

Updated : Nov 9, 2020, 5:13 PM IST

మయన్మార్​లో అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. సంపూర్ణ ప్రజాస్వామ్యం కోసం ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఓటింగ్​లో పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద నగరం యాంగోన్​లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోవటం సహా ప్రజల నుంచి మద్దతు లభించటం వల్ల 'స్టేట్​ కౌన్సిలర్​' పీఠాన్ని మరోమారు అధిరోహించేందుకు నోబల్​ శాంతి బహుమతి విజేత ఆంగ్​ సాన్​ సూకీకి మార్గం సుగమం అయినట్లు కనిపిస్తోంది.

"ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో ప్రజలు ఓట్లు వేశారు. రాజకీయ సంక్షోభం నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు భావిస్తున్నా. వారు సంపూర్ణ ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు. "

- జా విన్​ తున్​, యాంగోన్​లోని పోమై పోలింగ్​ కేంద్ర అధికారి.

బలహీన విపక్షంతో..

మయన్మార్​ పార్లమెంట్​ ఉభయసభలకు ఈ ఎన్నికల్లో 90కిపైగా పార్టీలు పోటీ పడ్డాయి. అలాగే, కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి ఎన్నికలు కూడా జరిగాయి. సుమారు 37 మిలియన్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు 5 మిలియన్ల మంది ఉండటం గమనార్హం. విపక్షాలు అంతగా ప్రభావం చూపలేకపోతున్న క్రమంలో ఆంగ్​ సాన్​ సూకీ దేశవ్యాప్తంగా అత్యంతర ప్రజాదరణ పొందిన రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. కానీ ఆమె ప్రభుత్వం అంచనాలకు తగ్గట్టుగా రాణించకపోవటం కాస్త ఆందోళన కలిగించే అంశం. అయినప్పటికీ.. ప్రజలు ఆమె వైపే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

"సూకీ పార్టీకీ ప్రత్యామ్నాయంగా, ప్రజల నమ్మకాన్ని దక్కించుకునే ఏ ఒక్క ప్రధాన పార్టీ కనిపించటం లేదు. బర్మన్​ జాతీ మెజారిటీ ఉన్న మయన్మార్​లో సూకీ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సూకీ పట్ల చాలా మందికి ఉన్న వ్యక్తిగత మద్దతు, ప్రేమ కూడా... ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తోంది అనే దానితో సంబంధం లేకుండా ఓట్లు వేసేందుకు దోహదపడింది."

- రీచర్డ్​ హార్సే, రాజకీయ విశ్లేషకులు.

మరోవారం..

సోమవారం ఉదయం ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే.. మారుమూల గ్రామాల నుంచి ఓట్లను సమీకరించేందుకు మరోవారం సమయం పట్టే అవకాశం లేకపోలేదు. ఈ ఎన్నిక సూకీ నాయకత్వంపై ప్రజాభిప్రాయ సేకరణగా విస్తృతంగా కనిపిస్తోంది.

ఇదీ చూడండి: సంపూర్ణ ప్రజాస్వామ్యం వైపు మయన్మార్‌!

Last Updated : Nov 9, 2020, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details