మయన్మార్‌లో రోజు రోజుకు పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. నిషేధం ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేపడుతున్నారు. పలు నగరాల్లో భద్రతా బలగాల పహారాతో పాటు అంతర్జాలం నిలిపివేతకు దిగింది సైన్యం. దీంతో మయన్మార్‌లోని అతిపెద్ద నగరం యాంగూన్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
సూకీ నిర్బంధం పొడిగింపు.. ఆందోళనలు ఉద్ధృతం ఆందోళనకారులపై హింసాత్మక చర్యలు మానుకోవాలని అమెరికా, కెనడా సహా 12 ఐరోపా దేశాల రాయబారులు సూచించారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయటం, సమాచార వ్యవస్థలో కలుగజేసుకోవటాన్ని ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
" ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, శాంతి, సంక్షేమం కోసం పాటు పడుతున్న మయన్మార్ ప్రజలకు మేము మద్దతిస్తున్నాం. "
- సంయుక్త ప్రకటన
సూకీ నిర్బంధం పొడిగింపు..
మయన్మార్ కీలక నేత ఆంగ్ సాన్ సూకీ నిర్బంధం పొడిగించింది సైన్యం. సోమవారంతో ఆమె నిర్బంధ గడువు ముగుస్తున్నప్పటికీ.. దేశంలో ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో పొడిగించారు. ఆందోళనకారుల డిమాండ్లలో సూకీ విడుదలే ప్రధానంగా ఉంది. ఫిబ్రవరి 17 వరకు నిర్బంధంలోనే ఉంటారని ఆమె తరఫు న్యాయవాది ఖిన్ మౌంగ్ జా తెలిపారు.
సూకీ నిర్బంధం పొడిగింపుతో ఆందోళనలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. దేశవ్యాప్తంగా సోమవారమూ పెద్ద సంఖ్యలో నిరసనలు చేపట్టారు. మండాలయ్ నగరంలోని వీధుల్లో వందల మంది ఇంజినీర్లు ర్యాలీ తీశారు. తమ నేతలను విడుదల చేయాలని, అరెస్టు చేయటం ఆపాలంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు.
ర్యాలీ చేపడుతోన్న ఇంజినీర్లు భారీగా మోహరించిన భద్రతా బలగాలు ఇదీ చూడండి:నగరంలోకి సైన్యం- పౌరుల హక్కులకు తూట్లు!