ఈ శతాబ్దపు ప్రపంచ జనాభా(World Population) 2064లో అత్యధికంగా ఉంటుందని, అయితే.. శతాబ్దం చివరి నాటికి అందులో 50% తగ్గుదల కనిపిస్తుందని అధ్యయనకర్తలు అంచనా వేశారు. మరీ అంత తగ్గుదల ఎందుకు ఉంటుందని ఆశ్చర్యపడాల్సిన పనిలేదట! సమాజం నుంచి ఎదురయ్యే రకరకాల ఒత్తిళ్ల కారణంగా మానవ పునరుత్పత్తి సామర్థ్యం(human fertility) గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమవుతుందని వారు విశ్లేషించారు. యూనివర్సిటీ ఆఫ్ మసాచూ సెట్స్ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనాన్ని 'ఎండోక్రైనాలజీ' పత్రిక సమీక్షించింది.
"జనాభా పెరుగుదలతో పాటు వారి మధ్య అర్థరహితమైన సామాజిక పరిస్థితులు కూడా ఎక్కువవుతున్నాయి. దీనికితోడు జీవనశైలిలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతున్నారు. గత 50 ఏళ్లలో పురుషుల వీర్యాణువులు దాదాపు సగం మేర తగ్గిపోయాయి. ఫలితంగా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మానవ పునరుత్పత్తి తీరులో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. అయితే 2064 నాటికి ప్రపంచ జనాభా అత్యధికంగా ఉంటుంది. ఆ తర్వాతి నుంచి ఆ సంఖ్య క్రమంగా తగ్గుతుంది. దంపతుల్లో సంతానలేమి పెరుగుతుంది. పెద్ద వయసులో వివిధ ప్రత్యామ్నాయ విధానాల్లో పిల్లలను కనేవారు ఎక్కువవుతారు."
-ఎండోక్రైనాలజీ