శ్రీలంకలో ఆదివారం చర్చిలు, హోటళ్లపై జరిగినవి ప్రతీకార ఉగ్రదాడులని ఆ దేశ రక్షణమంత్రి రువాన్ విజెవర్ధనే పార్లమెంట్‌కు తెలిపారు. కొద్ది వారాల క్రితం న్యూజిలాండ్‌లోని మసీదులపై జరిగిన దాడికి ప్రతీకారంగానే శ్రీలంకలోని స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాదులు చర్చ్‌లపై బాంబు దాడులకు పాల్పడ్డారని ఆయన స్పష్టం చేశారు.
ఉగ్రదాడి అనంతరం తాజా పరిస్థితులపై చర్చించేందుకు శ్రీలంక పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి పూర్వాపరాలను పార్లమెంటుకు రక్షణమంత్రి వివరించారు. వరుస బాంబుదాడుల్లో ఇప్పటి వరకు 321 మంది మరణించారని, మరో 500 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. 375 మంది ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు.