తమ దేశానికి ఇంకా ఐసిస్ నుంచి ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉందన్నారు శ్రీలంక ప్రధానమంత్రి విక్రమ సింఘే. ఈస్టర్ రోజున బాంబు దాడులకు తెగబడిన ఉగ్రవాదులను తమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, కొందరిని హతమార్చారని తెలిపారు. దేశంలోని ప్రస్తుత భద్రతా పరిస్థితిపై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
ఐసిస్ హస్తం
ఈస్టర్ రోజున బాంబు దాడులకు తెగబడిన ముష్కరులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉగ్రసంస్థ ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు విక్రమ సింఘే. ఉగ్రవాదుల గురించిన సమాచారాన్ని త్వరగా తెలుసుకునేందుకు మరింత అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదం ఇంకా ముగియలేదని అన్నారు.