అఫ్గానిస్థాన్‌లో బాంబులు, కాల్పుల మోత కొనసాగుతోంది. తాలిబన్ల దాడిలో 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన మరుసటి రోజునే ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. ఈశాన్య బదాక్షన్ రాష్ట్రం సహా రాజధాని కాబూల్ పరిధిలో రెండు వేరు వేరు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ ఘటనల్లో 14 మంది అఫ్గాన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
బదాక్షన్ రాష్ట్రంలోని ఖాష్ జిల్లాలో పోలీసు తనిఖీ కేంద్రం (చెక్‌పాయింట్)పై దాడులు జరిగిన నేపథ్యంలో అక్కడికి వెళ్తున్న వాహనాన్ని రోడ్డు పక్కన బాంబు పెట్టి పేల్చేశారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు మృతి చెందారు. బాంబు దాడితో పాటు ఇరు వర్గాల మధ్య కాల్పులూ జరిగాయి. ఇందులో నలుగురు ముష్కరులు ప్రాణాలు కోల్పోయినట్లు బదాక్షన్ పోలీసు ఉన్నతాధికారి సనాఉల్లాహ్ రోహాని తెలిపారు.