ఒక ఫొటో కారణంగా పాకిస్థాన్ ప్రధాని - ఆ దేశ ఆర్మీ చీఫ్ మధ్య విభేదాలు తలెత్తాయి. అఫ్గాన్ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు - హక్కానీలు తన్నుకొంటున్న సమయంలో ఓ ఫొటో కలకలం రేపింది. కాబుల్‌లోని సెరీనా హోటల్‌లో పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ చీఫ్ ఫయాజ్ హమీద్ స్టైల్‌గా ఓ టీకప్పు పట్టుకొని దర్శనమిచ్చాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాక్ నేరుగా అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తనకు అవసరమైన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. మరో పక్క పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా కూడా దీనిపై అంసంతృప్తి వ్యక్తం చేశారు. తాలిబన్ల వెనుక ఐఎస్‌ఐ ఉందన్న విషయం బహిర్గతం కావడమే దీనికి ముఖ్య కారణం. తన అనుమతి లేకుండా ఐఎస్‌ఐ చీఫ్ దేశం దాటడంపై నోటీసులు జారీ చేసి పంచాయతీ పెట్టారు. చివరికు రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో విచారణ జరిపి ఫయాజ్ చేత క్షమాపణలు చెప్పించారు.
ఈ వివాదం అంతటితో ముగిసిందని అంతా భావించారు. కానీ, గత వారం ఫయాజ్ హమీద్‌ను హఠాత్తుగా పెషావర్ కోర్(12వ కోర్)కు బదిలీ చేస్తూ ఆర్మీ చీఫ్ కమర్ బజ్వా ఉత్తర్వులు జారీ చేశారు. హమీద్ స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అహ్మద్ అంజుమ్‌ను నియమించారు. ఇక్కడే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. దీంతో రోజులు గడుస్తున్నా.. కమర్ బజ్వా ఉత్తర్వులను అమలు చేస్తూ ప్రధాని కార్యాలయం నుంచి నోటిఫికేషన్ వెలువడలేదు. దీనికి తోడు హమీద్‌ను ఐఎస్‌ఐ చీఫ్‌గా కొనసాగించాలని ఇమ్రాన్ పట్టుబట్టారు. దీంతో ఆర్మీ చీఫ్‌కు ప్రధానికి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి.
ఫయాజ్ హమీద్‌పై ఇమ్రాన్‌కు అంత ప్రేమ దేనికి..?
పాక్ సైన్యంలోని ఫయాజ్ హమీద్ బలోచ్ రెజ్‌మెంట్ నుంచి వచ్చారు. ఆయన త్రీస్టార్ జనరల్. ఆర్మీ చీఫ్ అయ్యే అర్హత ఉన్న జనరల్స్ వరుసలో నాలుగో స్థానంలో ఉన్నారు. 2019లో ఐఎస్‌ఐ చీఫ్‌గా ఆయన్ను నియమించారు. అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న ఆసిమ్ మునీర్‌ను 8 నెలల్లోనే తొలగించారు. దీనికి ఓ కారణం ఉంది. ఫయాజ్ హమీద్ ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. 2018 పాక్‌లో ఎన్నికలు జరిగిన సమయంలో ఫయాజ్ హమీద్ డిప్యూటీ ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్నారు. ఆయన అంతర్గత భద్రతకు బాధ్యత వహిస్తారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులను నేరుగానే బెదిరించారు. వారిని ఇమ్రాన్ ఖాన్ ఏర్పాటు చేసిన పీటీఐ పార్టీలో చేరేలా ఒత్తిడి చేశారు. నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌ఎన్ పార్టీ ఇచ్చిన టికెట్లను తీసుకోవద్దని అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు పీఎంఎల్‌ఎన్ ఓట్లలో చీలిక తెచ్చేందుకు పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్‌లో ఓపార్టీని పెట్టించారు. ఒక దశలో పాక్‌లోని ఎలక్షన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ఆర్‌టీఎస్‌ను కూడా కుప్పకూల్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. హమీద్ ఎన్నికల అవకతవకలపై పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపణలు చేశారు.
ఫయాజ్ హమీద్ తీరుతో ఆగ్రహించి భార్యే అతనిపై కాల్పులు జరిపిన విషయాన్ని పాక్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఒకరు బహిర్గతం చేసినందుకు ఆ విలేకరి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది.