జపాన్ రాజధాని టోక్యోను శక్తిమంతమైన ఫక్సాయ్ తుపాను అతలాకుతలం చేసింది. భీకర గాలులు, వర్షాల వల్ల రాజధాని ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 2,90,000 గృహాలకు విద్యుత్ నిలిచిపోయింది. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు, విమానసేవలు నిలిపివేశారు.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా తీర ప్రాంతంలోని సుమారు 5 వేల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపింది.
తీవ్రమయ్యే అవకాశం
తుపాను మరింత తీవ్ర రూపు దాల్చే అవకాశముందని జపాన్ వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ ఈదురుగాలులు, వర్షాలు, వరదలు రావొచ్చని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.