ఆహార కష్టాల్లో ధ్రువపు ఎలుగులు - russian
వాతావరణంలో వస్తోన్న మార్పులకు జంతువులు ఆకలి కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల రష్యాలో ధ్రువపు ఎలుగుబంట్లు ఆహారం కోసం గ్రామాల్లోకి వచ్చాయి. సరైన తిండి లభించక వ్యర్థాలనే తింటున్నాయి. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రష్యాలోని బెల్యుషా గుబా గ్రామంలో 50 ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. ఫలితంగా స్థానిక ప్రభుత్వం వారం రోజుల పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది. ధ్రువపు ఎలుగుబంట్లు మంచు ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. అక్కడ దొరికే షీల్స్ వంటి చేపలతో కడుపు నింపుకుంటాయి. కానీ ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులతో మంచు ఎలుగులు ముప్పు ఎదుర్కొంటున్నాయి. వాటికి ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడింది. అందుకే దగ్గరలోని గ్రామాల్లోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నాయి. ఆహారం దొరక్క ఎలుగులు చెత్త డబ్బాల్లోని వ్యర్థాలను తింటూ కనిపించిన వీడియోపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవులు చేస్తోన్న విఘాతానికి జీవ మనుగడ ఎలా దెబ్బతింటుందో ఇదే నిదర్శనం అంటూ అభివర్ణిస్తున్నారు.