Petrol Prices Hike: ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పలు దేశాల్లో చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముడిచమురు ధరలకు అనుగుణంగా.. శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది చమురు విక్రయ కంపెనీ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్‌ఐఓసీ). ఇది భారత చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ. తాజా ధరల పెంపుతో అక్కడ ఇంధన ధరలు డబుల్ సెంచరీని దాటేశాయి.
Petrol Prices in Sri Lanka
శ్రీలంకలో లీటర్ డీజిల్‌పై రూ.75(శ్రీలంక రూపాయి), పెట్రోల్‌పై రూ.50 చొప్పున పెంచినట్లు ఎల్‌ఐఓసీ తెలిపింది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.254కు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ.214కు ఎగబాకింది. శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమయినందున ఎల్‌ఐఓసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో ఒకే నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశానికి.. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయికి చేరడం వల్ల.. మూలిగే నక్కపై తాడిపండు పడినట్లు తయారైంది.
"శ్రీలంక రూపాయి విలువ భారీగా పతనమై.. డాలర్‌తో పోలిస్తే.. రూ.57కు తగ్గింది. ఈ విధంగా రూపాయి విలువ క్షీణించడం ఏడు రోజుల్లో ఇది రెండోసారి. ఇది చమురు. గ్యాసోలిన్ ఉత్పత్తుల ధరలను నేరుగా ప్రభావితం చేసింది. అమాంత ఇంధన ధరల పెరుగుదలకు దారి తీసింది. దాంతో పాటు రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సహా ఐరోపా దేశాలు ఆంక్షలు విధించడం చమురు, గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి."
- ఎల్‌ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా
శ్రీలంక సర్కారు నుంచి ఎల్ఐఓసీకి ఎలాంటి రాయితీలు పొందదని.. ఫలితంగా అంతర్జాతీయంగా చోటుచేసుకున్న తాజా పరిణామాలతో సంస్థ నష్టపోతోందని మనోజ్ పేర్కొన్నారు. ఈ నష్టాల నుంచి బయటపడాలంటే.. ఇంధన ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేదన్నారు. అయితే ధరలు పెంచినప్పటికీ.. భారీ నష్టాలు తప్పడం లేదని ఆందోళన వ్యక్త చేశారు మనోజ్ గుప్తా.