ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కోటి దాటింది. మరోవైపు పలు దేశాల్లో వైరస్ పంజా విసురుతోంది. అమెరికాలో 55 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్, రష్యా, మెక్సికో దేశాల్లో వైరస్ విలయతాండవం చేస్తోంది.
కోటి దాటిన కరోనా రికవరీలు
By
Published : Jul 27, 2020, 8:30 AM IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ.. అదే స్థాయిలో బాధితులు కోలుకోవడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఇప్పటివరకు కరోనా బారి నుంచి బయటపడిన వారి సంఖ్య కోటి దాటిపోయింది. మరో 57 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కోటి 64 లక్షల మందికి కరోనా సోకగా.. 6.52 లక్షల మంది మరణించారు.
మరోవైపు అన్ని దేశాల్లో కలిపి కొత్తగా 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా, మెక్సికో దేశాల్లో వైరస్ విలయతాండవం చేస్తోంది.
అమెరికా..
అగ్రరాజ్యంలో మరో 55 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 43.71 లక్షలకు ఎగబాకింది. 447 మంది కరోనాకు బలయ్యారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 1,49,845కి చేరింది.
బ్రెజిల్..
బ్రెజిల్లో కొత్తగా 23 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 24.19 లక్షలకు చేరింది. మరో 556 మంది బాధితులు కొవిడ్ ధాటికి మరణించారు. బ్రెజిల్లో కరోనా కారణంగా ఇప్పటివరకు 87 వేల మందికి పైగా మృతిచెందారు.
దక్షిణాఫ్రికా..
ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా కరోనాకు కేంద్ర బిందువుగా మారింది. ఆ ఖండంలో సగానికిపైగా కేసులు దక్షిణాఫ్రికాలోనే నమోదుకాగా.. తాజాగా మరో 11 వేల పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. 114 మంది మరణించారు. దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య 4.45 లక్షలకు చేరగా... మరణాల సంఖ్య 6,769కి ఎగబాకింది.
మెక్సికో..
కొవిడ్‌తో మెక్సికో అతలాకుతలమవుతోంది. మరో 6,751 పాజిటివ్ కేసులు నిర్ధరణతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 3,85,036కి చేరింది. 729 మంది మరణంతో మెక్సికోలో వైరస్ బాధితుల సంఖ్య 43,374కి పెరిగింది.
కొలంబియా
కొలంబియాలో 8 వేలకు పైగా కొత్త కేసుల నమోదుతో బాధితుల సంఖ్య 2.48 లక్షలకు చేరింది. 256 మంది మరణించారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 8,525కి చేరుకుంది.