"భారత్ గురించి దుష్ప్రచారం చేయడం... లేదా రహస్య సమాచారం సేకరించడం"... కొంతకాలంగా పాకిస్థాన్‌కు ఇదే పని. ఇందుకు అంతర్జాలాన్నే ప్రధాన వేదికగా చేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు, వాట్సాప్‌లో గ్రూపులతో భారత్‌పై విషం చిమ్మే పని సాగిస్తోంది.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అసత్య సమాచారం వ్యాప్తికి పాకిస్థాన్ మరిన్ని అడ్డదారులు తొక్కుతున్నట్లు భద్రతా సంస్థలు తాజాగా గుర్తించాయి. అత్యంత ప్రజాదరణగల కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) వంటి టీవీ షోల పేరిట సందేశాలు పంపి, ప్రజల్ని బుట్టలో పడేస్తున్నట్లు వెల్లడించాయి.
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కేబీసీ పేరిట మోసపూరితంగా ప్రజల్ని వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి, అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు వివరించాయి భద్రతా సంస్థలు. అలాంటి రెండు గ్రూపులకు పాకిస్థానీ నంబర్లు కలిగిన వ్యక్తులు అడ్మిన్లుగా ఉండడాన్ని గుర్తించినట్లు తెలిపాయి. ప్రజలు తక్షణమే అలాంటి గ్రూపుల నుంచి బయటకు రావాలని భద్రతా సంస్థలు సూచించాయి.