తెలంగాణ

telangana

ETV Bharat / international

'సరిహద్దులో యుద్ధ విమానాలను తొలగిస్తేనే అనుమతి' - పాకిస్థాన్

సరిహద్దు వెంబడి వైమానిక స్థావరాల్లో భారత్‌ వాయు సేన మోహరించిన యుద్ధ విమానాలను తొలగించే వరకు తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలను అనుమతించమని పాకిస్థాన్‌ వెల్లడించింది. పాక్​ గగనతలంలో భారత విమానాలపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 26 వరకు పొడిగించింది.

'పాక్​ గగనతలంపై భారత విమానాల నిషేధం పొడిగింపు'

By

Published : Jul 12, 2019, 10:54 PM IST

Updated : Jul 13, 2019, 9:15 AM IST

'సరిహద్దులో యుద్ధ విమానాలను తొలగిస్తేనే అనుమతి'

తన​ గగనతలంపై భారత విమానాలకున్న నిషేధాన్ని అయిదవ సారి పొడిగించింది పాకిస్థాన్. ఈ నిషేధం ఈ నెల 26 వరకు కొనసాగుతుందని ఆ దేశ పౌరవిమానయాన కార్యదర్శి షారుఖ్​ నుస్రత్​ వెల్లడించారు.​ సరిహద్దు వద్ద ఉన్న భారత వాయు సేన ఎయిర్​ బేస్​ల నుంచి యుద్ధ విమానాలను వెనక్కి తీసుకునే వరకు తమ గగనతలాన్ని తెరవబోమని స్పష్టం చేశారు.

"గగనతలం తెరవడంపై భారత ప్రభుత్వం మమ్మల్ని సంప్రదిస్తోంది. మా దేశానికి దగ్గర్లోని ఎయిర్​ బేస్​ల వద్ద యుద్ధ విమానాలను ఇంకా మోహరించి ఉంచడంపై మా ఆందోళనలను భారత్​కు తెలియజేశాం. వాటిని వెనక్కి తీసుకొనే వరకు వాయుమార్గంపై విధించిన ఆంక్షలు కొనసాగుతాయి"

- షారుఖ్​ నుస్రత్​, పాక్​ విమానయాన శాఖ కార్యదర్శి

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయు సేన ఫిబ్రవరి 26న జైషే మహమ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. అప్పటి నుంచి భారత్​ విమానాలకు పాక్‌ తన గగనతలాన్ని మూసేసింది.

గత నెల బిష్కెక్‌లో జరిగిన షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్ సమావేశానికి తన వాయు మార్గం ద్వారా ప్రధాని మోదీ విమానం ప్రయాణించడానికి పాక్‌ అనుమతించింది. కానీ మోదీ మాత్రం ప్రత్యామ్నాయ మార్గాన్నే ఎంచుకున్నారు.

పాక్‌ ఆంక్షల కారణంగా భారత వైమానికి సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా ఎయిరిండియా అదనంగా రూ.430 కోట్లు ఖర్చు చేసిందని గురువారం భారత వైమానిక శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పార్లమెంటుకు వెల్లడించారు.

ఇదీ చూడండి: పాక్​ వేర్వేరు​ ప్రమాదాల్లో 34కు చేరిన మృతులు

Last Updated : Jul 13, 2019, 9:15 AM IST

ABOUT THE AUTHOR

...view details