తెలంగాణ

telangana

ETV Bharat / international

టీకా వేసుకోరా? అయితే ఫోన్‌ బ్లాక్‌, జీతం కట్​! - పాక్​లో టీకా తీసుకోకపోతే జీతం కట్​

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలంతా టీకా వేసుకోవాలని ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే పాకిస్థాన్ మాత్రం ఇందుకు భిన్నం. ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకోకపోతే వారి ఫోన్లను బ్లాక్‌ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వమని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

vaccination
వ్యాక్సినేషన్​

By

Published : Jun 13, 2021, 7:05 PM IST

కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. కరోనా మూడో దశ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న శాస్త్రవేత్తల హెచ్చరికలతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. వీలైనంత వరకు ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయించి కరోనా నుంచి వారిని రక్షించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రజలకు ప్రభుత్వాలు, ప్రముఖులు విజ్ఞప్తి చేయడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే, పాకిస్థాన్‌లో మాత్రం ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకోకపోతే వారి ఫోన్లను బ్లాక్‌ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వమని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

పలు దేశాలతో పోలిస్తే పాకిస్థాన్‌లో వ్యాక్సినేషన్‌ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటి వరకు కోటి మందికిపైగా మొదటి డోసు కొవిడ్‌ టీకా తీసుకుంటే.. వ్యవధి ముగిసినా రెండో డోసుకు ప్రజలు విముఖత చూపుతున్నారు. దీంతో రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య భారీగా పడిపోతోంది. వ్యాక్సిన్‌ వేసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయన్న వదంతులను నమ్మి ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకు రావట్లేదట. ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌, వ్యాక్సిన్‌ ఉపయోగాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వెనకడుగు వేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన పంజాబ్‌లో వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతున్నట్లు సమాచారం.

అందుకే పంజాబ్‌ ప్రభుత్వం ఇటీవల కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ వేసుకోని వారి మొబైల్‌ ఫోన్‌ లేదా నెట్‌వర్క్‌ను బ్లాక్‌ చేయించాలని నిర్ణయించింది. 'మొదట్లో ఇది ప్రతిపాదన కిందే ఉన్నా.. వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ప్రజలు ఇష్టపడకపోవడం వల్లే దీనిని చట్టంగా తీసుకొస్తున్నాం. అయితే, ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయాన్ని టెలికాం సంస్థలు నిర్ణయిస్తాయి' అని పంజాబ్‌ ఆరోగ్యశాఖ ప్రతినిధి హమ్మద్‌ రజా వెల్లడించారు.

అంతకుముందు సింధ్‌ రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జులై నెల వేతనం చెల్లించబోమని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు టీకా వేసుకున్న వారికి సినిమాలకు, వేడుకలకు, ప్రార్థనా మందిరాలకు వెళ్లడానికి అనుమతి ఇస్తోంది.

ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో 9.41లక్షల మందికి కరోనా సోకగా.. 8.76లక్షల మంది కోలుకున్నారు. 21,633 మంది మహమ్మారికి బలయ్యారు.

ఇదీ చూడండి:చైనాలో డెల్టా వేరియంట్​- డ్రోన్లతో ప్రజల కట్టడి

ABOUT THE AUTHOR

...view details