భారత్ నుంచి పోలియో మార్కర్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది పాకిస్థాన్. ఈ మేరకు ఆ దేశ ఫెడరల్ కేబినేట్ వన్-టైమ్ అనుమతులు ఇచ్చినట్లు పాక్కు చెందిన ఓ వార్తా సంస్థ వెల్లడించింది. జమ్ముకశ్మీర్ విభజన, అధికరణ 370 రద్దు చేసిన కొన్ని నెలల్లోనే పాకిస్థాన్ తన మొండి వైఖరి నుంచి వెనక్కి తగ్గింది. అన్ని రకాల వాణిజ్య సంబంధాలను తెంచుకున్న పాక్.. ఔషధాల దిగుమతిలో ఆచితూచి అడుగులు వేస్తోంది.
" భారత్ నుంచి పోలియో మార్కర్ల దిగుమతికి వన్-టైమ్ అనుమతి ఇవ్వాలని ఫెడరల్ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి మందుల దిగుమతిపై నిషేధం ఎత్తివేయాలని ఆ దేశ ఔషధ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. లేకపోతే కొన్ని వారాలలో పాకిస్థాన్ తీవ్ర మందుల కొరత, ముఖ్యంగా ప్రాణాలను రక్షించే ఔషధాల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించింది. దాని పర్యవసానంగా భారత్ నుంచి మందులు, ముడి పదార్థాల దిగుమతిపై నిషేధాన్ని గత సెప్టెంబర్లో ఎత్తివేసింది పాక్."
- పాక్ మీడియా సంస్థ
మార్కర్లు ఎందుకు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదిత పోలియో వాక్సిన్ను చిన్నారులకు అందించిన అనంతరం వారి వేలికి మార్కర్లతో గుర్తు పెడతారు. పోలియో చుక్కలు వేసే క్రమంలో పిల్లలు కొంత మేర ఇంకును మింగే అవకాశం ఉన్నందున విషపూరితం కాని మార్కర్ల దిగుమతి అవసరమని పాకిస్థాన్ పోలియో అత్యవసర సేవల కేంద్రం జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ రాణా సఫ్దార్ తెలిపారు.