ఆక్రమిత కశ్మీర్‌లో ప్రజలకు చేరువయ్యేందుకు పాకిస్థాన్ భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. తమ పట్ల వ్యతిరేకతను చల్లార్చి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పావులు కదుపుతున్నారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ భజ్వా, అత్యంత సన్నిహితులైన కమాండర్లకు బాధ్యతలను అప్పగించారు. పీవోకేలో పట్టు పెంచుకొనేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి ఆక్రమిత కశ్మీర్‌లో సైనిక పరంగా ఎంతో ఖర్చు చేస్తున్న పాకిస్థాన్.. అక్కడి ప్రజల బాగోగుల్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. భారత్‌ను నిలువరించడమే ధ్యేయంగా పాక్ సైన్యం నిరంతరం అక్కడ పనిచేస్తుంటుంది. ఇందులో భాగంగా ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర వాద శిబిరాలను సైతం నిర్వహిస్తోంది. అభివృద్ధి ఊసే ఎరుగని అక్కడి ప్రజలకు ఇది ఏమాత్రం రుచించడంలేదు. ప్రతి శుక్రవారం ఆ ప్రాంతంలో ప్రజలు ప్రార్థనల తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. పాకిస్థాన్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటారు. దీంతో వారిని ఎదుర్కోవడం పాక్ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో పీవోకే ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. ముందుగా అక్కడి ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పాక్ సైన్యాధిపతి జనరల్ భజ్వాతో కలిసి ప్రణాళికలు రచించారు. పీవోకే ప్రజలను బుజ్జగించాలని, వారిని పాక్‌కు మిత్రులుగా మార్చాలనేది వారి ప్రణాళిక. ఇందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు సైతం సిద్ధమయ్యారు. పాక్ ప్రధాని ప్రణాళిక ప్రకారం ఇప్పుడు పీవోకేలో నీలమ్ వ్యాలీ, లీపా వ్యాలీ, ముజఫరాబాద్, మురీద్‌కే, కోట్లీ, రావల్‌కోట్ తదితర ప్రాంతాల్లో ఆ దేశ సైన్యం ప్రత్యేక మిషన్ చేపట్టింది.
ఈ మిషన్‌లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సైనికులు వెళ్తున్నారు. పాకిస్థాన్ పట్ల అక్కడి జనంలో ఉన్న వ్యతిరేకతను పూర్తిగా తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం పాక్ వ్యతిరేక నిరసనలు చేయొద్దని నచ్చజెబుతున్నారు. అవసరాల్లో ఉన్నవారికి డబ్బులు కూడా ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో 33,498 మందికి నెలకు రూ.1546 చొప్పున సాయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం అందిస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడగానే అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే పీవోకే ప్రజల్ని బుజ్జగించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు అనుకూలంగా పీవోకే ప్రజలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి:బైడెన్-పుతిన్ తొలి విడత చర్చలు పూర్తి