అఫ్గానిస్థాన్‌లో ఉగ్రమూకల ఏరివేత కోసం రెండు దశాబ్దాల పాటు పోరాటం సాగించి.. ఈ ఏడాది ఆగస్టులో బలగాల ఉపసంహరణ పూర్తి చేసింది అమెరికా. భారీగా ఆయుధ సంపత్తిని అఫ్గాన్‌లోనే వదిలేసి (us military weapons used in afghanistan) బలగాలను తరలించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇప్పుడు ఆ ఆయుధాలను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది పాకిస్థాన్. అగ్రరాజ్యానికి చెందిన అధునాతన ఆయుధాలను అఫ్గానిస్థాన్ నుంచి పాకిస్థాన్ కొనుగోలు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఆ ఆయుధాలు తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ చేతికి వెళతాయనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ప్రభుత్వం, నిషేధిత ఉగ్ర సంస్థ మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది.
ఈ ఏడాది ఆగస్టులో కాబుల్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) సొంతం చేసుకున్న తర్వాత.. అఫ్గాన్ ఆర్మీ(Afghan Army) నుంచి భారీగా అమెరికా ఆయుధాలను స్వాధీనం చేసుకుని పాకిస్థాన్‌కు సరఫరా చేసినట్లు ద న్యూయార్క్ టైమ్స్ గత నెలలో వెల్లడించింది. అలాగే.. అఫ్గాన్ గన్ డీలర్స్ అమెరికా ఆయుధాలను నేరుగా దుకాణాల్లోనే విక్రయాలు జరుపుతున్నట్లు పేర్కొంది.
అయితే.. బలగాల ఉపసంహరణ పూర్తయ్యేలోపే అధునాతన ఆయుధాలను ధ్వంసం చేసినట్లు పెంటగాన్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే.. వేలాది ఆయుధాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.