ఆస్ట్రేలియాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కార్చిచ్చు జ్వాలలు కోటిన్నర ఎకరాల ప్రాంతాన్ని దగ్ధం చేశాయి. వేలాది ఇళ్లు, భవనాలు దగ్ధమయ్యాయి. లక్షలాది మూగ జీవాలు నేలరాలిపోయాయి. దావానలం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితులకు ప్రవాస భారతీయుల సహాయం కార్చిచ్చును అదుపు చేసేందుకు 3వేలకు పైగా అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు అహర్నిశలు శ్రమిస్తున్నా అదుపులోకి రావటం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన బలగాలతో పాటు దేశీయ సిబ్బందితో.. విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. హెచ్చరికలు జారీ..
ప్రస్తుతం ఆగ్నేయ ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భీకర గాలుల వల్ల మరిన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు రాజుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
విక్టోరియా రాష్ట్రంలో 23 చోట్ల మంటలు చెలరేగుతూనే ఉన్నాయని, పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వచ్చే 48 గంటల్లో జ్వాలలు తీవ్రంగా ఎగసిపడే ప్రమాదముందని ఆ రాష్ట్ర ఆత్యయిక స్థితి నిర్వహణా కమిషనర్ ఆండ్రూ క్రిస్ప్ తెలిపారు. కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు.
ఇప్పటికే కంగారూ ద్వీపంలోని పాండ్నా, న్యూ సౌత్ వేల్స్ ప్రాంతాల్లోని ప్రజలు తక్షణమే వారి గృహాలను విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
కోలుకోవడానికి రెండేళ్లు...
దావానలం ధాటికి ఆహుతైన మౌలిక సదుపాయల పునర్నిర్మానానికి అదనంగా మరో 2 బిలియన్ డాలర్లు కేటాయించింది ఆ దేశ ప్రభుత్వం. రాష్ట్రాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కనీసం రెండేళ్లు శ్రమించాల్సి ఉంటుందని అంచనా వేసింది.
ప్రధానిపై విమర్శలు..
2009లో కార్చిచ్చు ఇదే స్థాయిలో ఎగిసిపడింది.. ఆ ఘటనలో 180 మంది ప్రాణాలు కోల్పోయారు.. అప్పట్లో భయంకర ఘట్టాన్ని 'బ్లాక్ సాటర్డే'గా పేర్కొన్నారు. సరిగ్గా పదేళ్లకు అలాంటి భీకర ప్రళయమే మళ్లీ వచ్చింది. అయితే.. కార్చిచ్చుపై నిమ్మకు నీరెత్తినట్లున్నారని పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్. విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కార్చిచ్చు సహాయ చర్యలకు అదనంగా 9800 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
మానవత్వాన్ని చాటుతున్న సిక్కులు...
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు బాధితులకు సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నరు అక్కడి ప్రవాస భారతీయ సిక్కులు. న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లో సహృదయాన్ని చాటుతూ.... భారత ఖ్యాతిని పెంచుతున్నారు.
బాధితులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయ కార్మికులకు గురుద్వారాలు, రెస్టారెంట్లలో.... ఉచిత భోజనం, వైద్య సహాయం, కిరాణా సామగ్రిని అందిస్తున్నారు. ఆస్ట్రేలియా సిక్కు స్వచ్ఛంద సేవకుల సంఘం, యునైటెడ్ సిక్, ఖాల్సా ప్లమ్టన్, టర్బన్స్ ఫర్ ఆస్ట్రేలియా వంటి స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసి సహాయక చర్యలలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు భారతీయులు.
స్వచ్ఛంద సేవకుల్లో ఒకరైన సుఖ్విందర్ కౌర్ భారత్కు వచ్చేందు సర్వం సిద్ధం చేసుకున్నాక తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని మరీ.. బాధితులకు ఆహారం అందిస్తూ.. సమాజమే మన కుటుంబమని ఎలుగెత్తి చాటుతున్నారు.
'కోమాలో ఉన్న మా అక్కను చూసేందుకు భారత్కు బయల్దేరాను. కానీ, అదే సమయంలో ఈ విపత్తు వచ్చింది. అప్పుడే నిర్ణయించుకున్నా.. ఎన్నో ఏళ్లు నాకు నీడనిచ్చిన ఈ నేలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలను వదిలేసి వెళ్లిపోతే నేను మంచి మనిషిని మాత్రం కాలేను. వీరంతా నా కుటుంబమే కాబట్టి నాకూ బాధ్యత ఉంది. నా కుటుంబం ఇంత విపత్తులో ఉంటే వదిలి వెళ్లలేను."
- సుఖ్విందర్ కౌర్, ఆస్ట్రేలియా సిక్కు వాలంటరీ
సిక్కులు ఆస్ట్రేలియాలో చేస్తున్న సేవలపై భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫేస్బుక్లో స్పందించారు. వారిని మానవత్వానికి ప్రతీకలుగా నిర్వచించారు.
'ప్రకృతి ప్రళయంలో చిక్కుకున్న బాధితులకు సేవలందిస్తున్న ఆస్ట్రేలియా సిక్కులకు సాహో. వారి అడుగులు ప్రశంసనీయం, మానవత్వానికి నిదర్శనం. మనమంతా ఆస్ట్రేలియా కోసం ప్రార్థిద్దాం.. త్వరలో పరిస్థితి అదుపులోకి రావాలని ఆశిద్దాం.'
-యువరాజ్ సింగ్, భారత క్రికెటర్
53 ఏళ్లుగా సేవ..
విపత్తు వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు టోమెరాంగ్ రాష్ట్రానికి చెందిన డగ్ షట్జ్. 53 ఏళ్ల క్రితం కార్చిచ్చు దేశానికి కలుగజేసే నష్టాన్ని గమనించి స్వచ్ఛందంగా సేవలు ప్రారంభించాడు డగ్ షట్జ్. అప్పుడు ఆయన వయసు 13 ఏళ్లు. 2001లో వచ్చిన విపత్తులో ఆయన వ్యాపారం కోల్పోయినా.. దిగులు చెంతకుండా తన సేవలను కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.
ఇదీ చదవండి:నా జీవితాన్ని నాశనం చేసింది అతనే..!