తెలంగాణ

telangana

ETV Bharat / international

చీలిక దిశగా నేపాల్​ అధికార పార్టీ!

నేపాల్​ అధికార పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి. త్వరలోనే చీలికలు వచ్చే అవకాశం ఉన్నట్లు సహచరులతో చెప్పారు. అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి తాజా పరిస్థితులపై చర్చించారు ఓలి.

Nepal's ruling party in grave crisis:
ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి

By

Published : Jul 5, 2020, 5:16 PM IST

నేపాల్​ రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధానమంత్రి రాజీనామాకు సొంత పార్టీ నుంచే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేపీ శర్మ ఓలి. అధికార కమ్యూనిస్ట్​ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. త్వరలోనే చీలికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు తన అధికారిక నివాసంలో అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు ఓలి.

" మన పార్టీలోని కొంత మంది రాష్ట్రపతి విద్యా దేవి భండారీని కూడా పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారు. ప్రస్తుతం నన్ను ప్రధానమంత్రి, పార్టీ ఛైర్మన్​ పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. అది ఎన్నటికీ జరగనివ్వబోను. అధికార పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది."

- కేపీ శర్మ ఓలి, నేపాల్​ ప్రధానమంత్రి

ఈ సందర్భంగా మంత్రులు తనకు మద్దతు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని స్పష్టంచేయాలని కోరారు ఓలి.

అవాస్తవం..

రాష్ట్రపతిని పదవి నుంచి దింపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఓలి పేర్కొన్న తర్వాత ముగ్గురు మాజీ ప్రధానులు పుష్ప కమల్​ దహాల్(ప్రచండ), మాధవ్​ నేపాల్​, జనలంత్​ ఖనల్ విద్యా దేవి భండారీతో భేటీ అయ్యారు. నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ నాయకులు రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని వివరించారు.

సోమవారం కీలక ఘట్టం

శక్తిమంతమైన ఎన్​సీపీ స్టాండింగ్​ కమిటీ భేటీ సోమవారం జరగనుంది. ఈ సమావేశంలోనే ప్రధాని ఓలి రాజకీయ భవితవ్యం తేలనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: కీలక భేటీలతో ఉత్కంఠగా నేపాల్​ రాజకీయాలు

ABOUT THE AUTHOR

...view details