నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ.. రాముడు తమ దేశం వాడేనని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగింది నేపాల్ యంత్రాంగం. ప్రధాని ప్రకటనలో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని చెప్పింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఓలీ వ్యాఖ్యలపై నేపాల్ విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. తన వ్యాఖ్యలను ప్రధాని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
"శ్రీరామునికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. రామాయణం సహా సాంస్కృతిక భౌగోళిక అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరాన్నే ప్రధానమంత్రి ఎత్తిచూపారు."
-నేపాల్ విదేశాంగ శాఖ ప్రకటన
అయితే ప్రతిఏటా భారత్లోని అయోధ్య నుంచి నేపాల్ జానక్పుర్ వరకు వివాహ పంచమి ఊరేగింపు జరుగుతుందని ప్రధాని గుర్తుంచుకోవాలని విపక్ష నేతలు అన్నారు. ఆయన దానికేమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.