మయన్మార్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వం, అక్కడి పౌరుల వ్యక్తిగత హక్కులను కాలరాసే దిశగా మరో అడుగు వేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని తొలగించిన సైన్యం.. అధ్యక్షుడు యూ విన్ మింట్, ప్రభుత్వ నేత ఆంగ్ సాన్ సూకీలతో సహా పలువురిని ఇదివరకే అదుపులోకి తీసుకుంది. అనంతరం పౌర నిరసనలను కట్టడి చేసేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలను అందుబాటులో లేకుండే చేసేందుకు విఫలయత్నం చేసింది. ఇప్పుడు తాజాగా ఆ దేశ పౌరుల వ్యక్తిగత స్వాతంత్ర్యం, భద్రతలకు రక్షణ కల్పించే చట్టాలను సవరిస్తూ భద్రతా దళాల కమాండర్ ఇన్ చీఫ్, సైనిక ప్రభుత్వ నేత సెన్ జెన్ మిన్ యాంగ్ లయింగ్ ఆదేశాలు జారీ చేశారు.
దీనిలో భాగంగా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రతల రక్షణ చట్టం లోని 5,7,8 సెక్షన్లను రద్దు చేశారు. ఈ ఆదేశాలు అత్యయిక పరిస్థితి విధించిన ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించారు. కాగా, మయన్మార్ సైనిక ప్రభుత్వ తాజా చర్య మరోసారి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విమర్శలను ఎదుర్కోవటం తప్పదని పరిశీలకులు అంటున్నారు.
సైనిక కదలికలు
మరోవైపు, మయన్మార్‌లోని అతిపెద్ద నగరమైన యంగాన్లో భద్రతా దళాల వాహనాలు భారీ స్థాయిలో కనిపించడం కలకలం రేపుతోంది. రాజకీయంగా నగరంలో ఆందోళనలను మరింత పెంచుతోంది. అయితే, యంగాన్లో సైనిక సిబ్బంది వాహనాలు కనిపించడానికి గల అధికారిక కారణాలు తెలియలేదు. ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు జైళ్లలోని నేరస్థులను విడుదల చేస్తున్నారన్న వార్తల మధ్య అక్కడి పౌరులు ఇప్పటికే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఇంటర్నెట్ షట్‌డౌన్!
సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా మయన్మార్‌లో ఇప్పటికే నిరసనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాలం నిలిపివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. రవాణా, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ.. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 9 గంటల వరకు ఇంటర్నెట్ నిలిపివేయాలని అందులో స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ ఉత్తర్వులు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
ఇదివరకు లీకైన ఇలాంటి వార్తలు తర్వాత నిజమయ్యాయి. వీటికి బలం చేకూర్చుతూ మయన్మార్‌లోని యూఎస్ ఎంబసీ సైతం.. తమ ప్రజలను అప్రమత్తం చేసింది. సైనిక కదలికలు, ఇంటర్నెట్ షట్‌డౌన్ ఉండే అవకాశం ఉందని పేర్కొంది.